
Cement Bag: ఈ రోజుల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఇంటిని నిర్మించుకోవాలంటే పెద్ద సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే గతంలో పోలిస్తే ఇప్పుడు కొత్త ఇంటిని నిర్మించుకోవాలంటే ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఎందుకంటే ఐరన్, సిమెంట్, కూలీల ఖర్చులు, డోర్స్ ఇలా అన్నింటి ధరలు విపరీతంగా పెరిపోయాయి. అయితే ఇంటి నిర్మాణంలో కీలక పాత్ర పోషించే మెరిటీయల్లో సిమెంట్ ఒకటి. ఇంటి బలానికి సిమెంట్ చాలా ముఖ్యం. మంచి నాణ్యమైన సిమెంట్ వాడితే పది కాలాల పాటు బలంగా ఉంటుంది. లేకుంటే ఇల్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని నిపుణులు పదేపదే చెబుతుంటారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఇంటి నిర్మాణానికి కొనుగోలు చేసే సిమెంట్ బస్తా కేవలం 50 కిలోలే ఉంటుంది. ఎలాంటి ఇల్లు నిర్మించాలన్నా.. ఎన్ని బస్తాలు కావాలంటే ఈ పరిమాణంలోనే లభిస్తాయి. అయితే సిమెంట్ బస్తా 20, 40 లేదా 100 కిలోల బస్తాల్లో ఎందుకు విక్రయించరు? 50 కిలోల ప్యాకింగ్ వెనుక కారణాలు ఏంటో తెలుసుకుందాం..

సిమెంట్ అనేది ప్రతి నిర్మాణ రంగంలో అత్యంత ముఖ్యమైనది. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, ఫ్యాక్టరీలు, అపార్ట్మెంట్లు వంటి ఇలాంటి ప్రతి ఒక్క నిర్మాణంలో సిమెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి సమయంలో సిమెంట్‌ను ప్యాక్ చేసే పరిమాణం తయారీదారులకు, వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి. 20 కిలోల బస్తాలు ఉపయోగిస్తే అదే మొత్తంలో సిమెంట్ కోసం ఎక్కువ బస్తాలు కావాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.. 100 కిలోల సిమెంట్‌కు 20 కిలోల బస్తాలు ఉపయోగిస్తే ఐదు బస్తాలు కావాల్సి ఉంటుంది. అదే 50 కిలోల బ్యాగులైతే రెండు మాత్రమే సరిపోతాయి. బస్తాల సంఖ్య తగ్గడంతో ప్యాకేజింగ్ సామగ్రి, ప్యాకింగ్ ప్రక్రియ, నిల్వ, రవాణా వంటి ఖర్చులు కూడా తగ్గుతాయి. అందుకే 50 కిలోల పరిమాణం ఆర్థికంగా అనుకూలంగా మారిందని చెబుతుంటారు.

ఇంటి నిర్మాణంలో సిమెంట్ బస్తాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించాల్సి ఉంటుంది. పై అంతస్తుకు తరలించాల్సి వచ్చినప్పుడు లిప్ట్ అందుబాటులో ఉండదు. అలాంటి సమయంలో ఎక్కువ బరువుతో ఉంటే కూలీలకు మోయడానికి ఇబ్బందిగా మారవచ్చు. 100 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువున్న బస్తాలను చేతులతో మోయడం చాలా కష్టం. దీనికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. దీని వల్ల కూలీలు మోసేందుకు ఆసక్తి చూపరు. అదే 50 కిలోల బస్తాలను మాత్రం సులభంగా మోసేందుకు ఉంటుంది. ఇలా ఎక్కువ కిలోలు ఉంటే మోయడానికి ఇబ్బంది ఉంటుంది. అలాగే తక్కువ కిలోలు ఉంటే ఎక్కువ బస్తాలు అవసరం ఉండటం, రవాణా ఖర్చు కూడా పెరగడం, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. 50 కిలోల బస్తాల వల్ల సిమెంట్ స్టాక్‌ను లెక్కించడం సులభంగా ఉంటుంది. 20 బస్తాలు అంటే 1,000 కిలోలు లేదా ఒక టన్ను. దీంతో కాంట్రాక్టర్లు, వ్యాపారులు, నిర్మాణ సంస్థలు తమ వద్ద ఉన్న సిమెంట్ నిల్వను సులభంగా నిర్వహించుకోవచ్చు.

అయితే ప్రపంచవ్యాప్తంగా సిమెంట్ బస్తా తప్పనిసరిగా 50 కిలోలే ఉండాలనే అంతర్జాతీయ నిబంధన లేదు. కొన్ని దేశాల్లో 40 కిలోల వంటి ఇతర పరిమాణాల్లోనూ సిమెంట్ విక్రయిస్తారు. స్థానిక మార్కెట్ అవసరాలు, ఖర్చులు, కార్మికుల సౌలభ్యం, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వ్యాపార పద్ధతుల ఆధారంగా ప్యాకేజింగ్ పరిమాణాలు మారుతుంటాయి.

వేల టన్నుల సిమెంట్ అవసరమయ్యే భారీ ప్రాజెక్టుల్లో మాత్రం ప్రతి సారి 50 కిలోల బస్తాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రాజెక్టులకు సిమెంట్‌ను బల్క్‌గా ప్రత్యేక ట్యాంకర్లు, నిల్వ వ్యవస్థలు, పంపింగ్ పరికరాల ద్వారా సరఫరా చేస్తారు. దీంతో బస్తాలను ఎత్తడం, దించడం వంటి అదనపు శ్రమ తగ్గుతుంది. అందువల్ల 50 కిలోల సిమెంట్ బస్తా వెనుక ఒక్క కారణం మాత్రమే లేదు. ప్యాకేజింగ్ ఖర్చు, రవాణా, నిల్వ, లెక్కింపు, కార్మికుల సౌలభ్యం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకునే ఇలాంటి 50 కిలోల పరిమాణంలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.