
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి జారీ చేసింది. దీంతో ప్లాస్టిక్ నోట్ల తయారీలో ఆర్బీఐ నిమగ్నమైంది. ఇప్పటికే పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించగా.. పలు అంతర్జాతీయ సంస్థలు సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి. త్వరలోనే నోట్ల ముద్రణ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

తొలి విడతలో రూ.10, రూ.20 ప్లాస్టి్క్ నోట్లను మార్కెట్లోకి విడుదల చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్ ప్రారంభించనుంది. 2027, ఏప్రిల్ 1 నుంచి ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీ నోట్ల సైజులోనే ఈ ప్లాస్టిక్ నోట్లు ఉంటాయి. దీంతో వల్ల ప్రస్తుత నోట్ల తరహాలోనే ఏటీఎం యంత్రాల్లో ఈ కొత్త నోట్లను పెట్టవచ్చు.

ఒకే పరిమాణంలో నోట్లను తీసుకురావడం వల్ల బ్యాంకులు ఏటీఎంలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఏటీఎంలో రూ.100, రూ.200, రూ.500 నోట్లను పెడుతున్నారు. ఈ సైజులోనే రూ.10, రూ.20 ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తయారుచేయడం ద్వారా ఏటీఎం మెషీన్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల బ్యాంకులకు ఖర్చు తగ్గుతుంది.

నోట్ల పరిమాణం మారితే ఏటీఎంలలో నోట్ డిస్పెన్సర్లు, సెన్సార్లు, ఇతర సాంకేతిక ఫీచర్లను మార్చాల్సి ఉంటుంది. దీని వల్ల ఏటీఎంలను రీసెట్ చేయాల్సి ఉంటుంది. గతంలో రూ.100, రూ.200 నోట్ల కోసం ఏటీఎం మెషీన్లను సవరించాల్సి వచ్చింది. దీని వల్ల అదనంగా రూ.100 కోట్ల ఖర్చయింది. ఇప్పుడు నోట్ల సైజులో మార్పులు చేయకపోవడం వల్ల రూ.212.5 మిలియన్ల ఖర్చు ఆదా కానుంది.

రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల కోసం 68 వేల రీముల ప్రత్యేక ప్లాస్టిక్ షీట్లను ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. ఈ షీట్లను పాలీప్రొపీలిన్తో తయారుచేస్తారు. విదేశాల్లో ప్లాస్టిక్ నోట్ల కోసం జంతువుల కొవ్వుతో తయారుచేసిన రసాయన పదార్థాలు వాడుతున్నారు. అయితే భారత్కు సరఫరా చేసే పాలిమర్ షీట్లలో అలాంటి రసాయనాలు ఎలాంటివి వాడకూడదని ఆర్బీఐ కండీషన్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న కాగితంతో తయారుచేసిన నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లు నాలుగు రెట్లు ఎక్కవ కాలం చెల్లుబాటులో ఉంటాయి.