
ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువగా లావాదేవీలు జరుగుతుండటంతో బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ప్రతీఒక్కరూ ఏదొక బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉంటారు. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను వివిధ అవసరాల కోసం వినియోగిస్తుంటారు. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు అయినా కలిగి ఉండవచ్చు. దానికి ఆర్బీఐ ఎలాంటి నిబంధనలు విధించలేదు.

అయితే బ్యాంక్ ఖాతాదారుల భద్రత, వేగవంతంగా సేవలు పొందేందుకు ఆర్బీఐ అనేక రూల్స్ ప్రవేశపెట్టింది. బ్యాంకులు వేగంగా సేవలు అందించేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయి. బ్యాంక్ సేవల్లో ఏమైనా ఆలస్యం జరిగితే ఖాతాదారుడు పరిహారం కూడా పొందవచ్చు. ప్రతీ సేవకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెడ్ లైన్ విధించింది. అవేంటి అనేది చూద్దాం.

కస్టమర్లు అందించే సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, జాప్యం జరిగినా కస్టమర్లకు బ్యాంకులు పరిహారం అందించాల్సి ఉంటుంది. రోజుకు రూ.100 నుంచి రూ.5 వేల వరకు కూడా జరిమానాలు ఉంటాయి. ఏటీఎం, యూపీఐ ట్రాన్సాక్షన్లకు సంబంధించి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినా లావాదేవీ పూర్తి కాకపోతే ఐదు రోజుల్లో ఖాతాదారుడికి తిరిగి జమ చేయాలి. లేకపోతే ఆ తర్వాత ప్రతీరోజు ఆలస్యానికి రూ.100 పరిహారం ఉంటుంది.

ఇక క్రెడిట్ కార్డు క్లోజ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత 7 పనిదినాల్లో బ్యాంక్ ప్రాసెస్ చేయాలి. ఆ తర్వాత ప్రతీరోజూ రూ.500 చొప్పున బ్యాంకులు కస్టమర్‌కు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక లోన్ తిరిగి చెల్లించిన తర్వాత ఆస్తి పత్రాలను 30 రోజుల్లోగా అందించాల్సి ఉంటుంది. లేకపోతే రోజూ రూ.5 వేల చొప్పున పరిహారం అందించాల్సి ఉంటుంది.

అలాగే క్రెడిట్ రిపోర్టులో తప్పులు పడిన సమయంలో కస్టమర్ ఫిర్యాదు చేసినప్పుడు బ్యాంకులు 30 రోజుల్లో పరిష్కరించాలి. లేకపోతే రోజుకు రూ.100 పరిహారం బ్యాంకులు ఖాతాదారుడికి చెల్లించాలి. ఇక బ్యాంక్ లాకర్‌లోని వస్తువులను నష్టం వాటిల్లితే.. వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు బ్యాంక్ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.