
ఇండియాలో రోజూ రైళ్లల్లో లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. దేశ నలుమూలకు రైల్వే కనెక్టివిటీ విస్తరించి ఉండగా.. ట్రైన్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీంతో ఎక్కువమంది రైలు ప్రయాణానికి ఇష్టపడుతుంటారు. రైళ్లల్లో ఎప్పుడూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. బెర్త్ కావాలంటే కొన్ని రోజుల ముందే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే సీట్లు ఖాళీగా లేనప్పుడు టికెట్లను బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళుతుంది. కన్పార్మ్ టికెట్లు పొందినవారు తమ జర్నీని క్యాన్సిల్ చేసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్‌గా వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ప్రయారిటీ పద్దతిలో సీటు కేటాయిస్తూ ఉంటుంది. ఇక ఆర్‌ఏసీ టికెట్లు కూడా పొందుతూ ఉంటారు. ఆర్ఏసీ టికెట్‌కు సంబంధించి రైల్వేశాఖ కొన్ని నిబంధనలు రూపొందించింది. అవేంటి అనేది చూద్దాం.

ఆర్‌ఏసీ టికెట్ అంటే.. ఒక సీటును ఇద్దరు పంచుకోవడం. ఈ టికెట్ ఉన్నవారికి సైడ్ లోయర్ బెర్త్ కేటాయిస్తారు. దీనిని ఇద్దరు ప్రయాణికులు పంచుకోవాల్సి ఉంటుంది. ఈ సీటును ఇద్దరికి సమానంగా విభజిస్తారు. దీని ద్వారా ఇద్దరు ప్రయాణికులు కూర్చోని మాత్రమే ప్రయాణం చేయగలరు. స్లీపర్ బెర్త్‌లా నిద్రిస్తూ ప్రయాణం చేయడం కుదరదు.

అయితే ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ఆర్ఏసీ టికెట్ పొందినవారికి మిగతా ప్రయాణికుల్లాగే బెడ్ షీట్, దిండు, దుప్పటి అందిస్తారు. ప్రయాణికులు ఇద్దరికి సగం సీటు లభించినా.. పడకపై ఇద్దరు ప్రయాణికులకు పూర్తి హక్కులు ఉంటాయి. అయితే ఆర్‌ఏసీ ప్రయాణికులకు రైలు బయల్దేరిన తర్వాత కూడా పూర్తి స్థాయి బెర్త్ కన్పార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని వల్ల ఆర్‌ఏసీ సీటు ధృవీకరించిన బెర్త్‌గా మారుతుంది.

రైలు బయల్దేరిన తర్వాత కన్ఫామ్ టికెట్ ఉన్న వ్యక్తి రాకపోతే ఆ సీటును ఆర్‌ఏసీ టికెట్ ఉన్నవారికి కేటాయిస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ఆర్‌ఏసీ టికెట్ ఉండి క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే రైలు బయల్దేరడానికి 30 నిమిషాల ముందు రద్దు చేసుకోవచ్చు. కేవలం కనీస క్లర్క్ ఛార్జీని కట్ చేసి మిగతా సొమ్ము రీఫండ్ అవుతుంది.