
కొత్త నెల వస్తుందంటే చాలు.. ఆర్ధిక విషయాల్లో అనేక మార్పులు సాధారణంగా చోటుచేసుకుంటుంటాయి. దేశంలోని ప్రజలందరినీ ఇవి ప్రభావితం చేస్తాయి. దీంతో ప్రతీఒక్కరూ వీటిని తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురుకావొచ్చు. నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఎల్పీజీ ధరలు, పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ నుంచి ఐటీఆర్ దాఖలు వరకు నవంబర్ నెల నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. వీటి గురించి డీటైల్డ్‌గా ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ 1 నుంచి వ్యాపారులు ఇచ్చే డిస్కౌంట్లపై జీఎస్టీ నిబంధనలను కేంద్రం సడలించనుంది. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లను ఎదుర్కొంటున్న వ్యాపారులకు తాత్కాలిక రీఫండ్ వేగవంతం చేయనుంది. 2026-27 బడ్జెట్‌లో దీనిని ప్రకటించగా.. ఇప్పుడు అమల్లోకి తీసుకురానున్నారు. ఇక పెన్షన్‌దారుల లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు నవంబర్ 1 నుంచి సమయం ఇవ్వనున్నారు. 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు నవంబర్ నుంచి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు.

నవంబర్ 30లోగా జీవిత ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇక 80 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు అక్టోబర్ 1 నుంచి సమర్పించేందుకు అవకాశం కల్పించారు. నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదముంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఈ పత్రం సమర్పించవచ్చు. ఇక ఆడిట్‌కు లోబడి ఉన్న ఖాతాలు గల నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ రిటర్న్ దాఖలు గడువును పొడిగించింది. 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి నవంబర్ 21 వరకు పొడిగించారు.

ఇక నవంబర్ 1వ తేదీ నుంచి ఫోన్ కాలింగ్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇక మీకు ఎవరైనా కాల్ చేస్తే వారి పేరు మీ ఫోన్‌లో డిస్‌ప్లే అవుతుంది. స్పామ్ కాల్స్, సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి దీనిని అమలు చేయాలని అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. టెలికాం రికార్డుల్లో నమోదైన పేరును ఫోన్లలో డిస్‌ప్లే చేయనున్నారు.

టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించేవారి కోసం వార్షిక పాస్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నవంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. దీని వల్ల టోల్ గేట్లకు సమీపంలో నివసించేవారు ప్రతీసారి ఛార్జీ కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ పాస్ ధర రూ.1500, రూ.3 వేలుగా ఉంది. టోల్ ప్లాజా ప్రదేశాన్ని బట్టి ఈ పాస్ ధర ఉంటుంది. చెల్లుబాటులో ఉన్న, పనిచేస్తున్న ఫాస్ట్‌ట్యాగ్‌లు కలిగిన వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.