
Gold Loan: ఈ రోజుల్లో బంగారంపై రుణాలు పెరిగిపోతున్నాయి. పర్సనల్ లోన్ కంటే బంగారం రుణాలపై ఆసక్తి చూపుతుంటారు. మీ వద్ద బంగారం ఉండి లోన్ తీసుకోవాలంటే కొన్ని నిమిషాల్లోనే లోన్ డబ్బులు మీ చేతికి వస్తాయి. అదే పర్సనల్ లోన్ అయితే ఎంతో ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకులు గానీ, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలుగా, ఇతర సంస్థలు ముందుగా మీ సిబిల్ను చెక్ చేస్తాయి. అప్పుడు మీ లోన్ ప్రాసెస్ ముందుకు కదులుతుంది. కానీ బంగారంపై లోన్ తీసుకోవాలంటే ఇవేమి అవసరం ఉండదు. మీ వద్ద బంగారం ఉంటే సరిపోతుంది.

బంగారాన్ని తాకట్టు పెట్టి సులభంగా లోన్ పొందవచ్చు. అయితే బంగారంపై తీసుకున్న రుణానికి సరైన సమయంలో వడ్డీ చెల్లించాలి. అలాగే ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే సరైన సమయంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లేకుంటే అధిక వడ్డీని చెల్లించాల్సిన ఉంటుంది. అలాగా సరైన చెల్లింపులు కొన్ని నెలల పాటు చెల్లించకుంటే అప్పుడు సంస్థలు వేలం వేస్తాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

రుణం చెల్లించకపోతే బంగారాన్ని వేలం వేయవచ్చా? గోల్డ్ లోన్ తీసుకున్న వ్యక్తి నిర్ణీత సమయంలో రుణాన్ని తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ఆర్బీఐ కొన్ని నిబంధనలు విధించింది. వేలం నిర్వహించే ముందు రుణగ్రహీతకు తగినంత ముందస్తు నోటీసు ఇవ్వాలి. అంతేకాకుండా వేలంలో బంగారం కనీస రిజర్వ్ ధర ప్రస్తుత మార్కెట్ విలువలో 90 శాతం కంటే తక్కువగా ఉండకూడదు. వరుసగా రెండుసార్లు వేలం విఫలమైతేనే ఈ పరిమితిని 85 శాతానికి తగ్గించవచ్చు.

రుణం తీర్చిన తర్వాత 7 రోజుల్లో బంగారం తిరిగి ఇవ్వాలి: గోల్డ్ లోన్ తీసుకున్నవారికి మరో ముఖ్యమైన వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. రుణగ్రహీత మొత్తం అప్పును చెల్లించిన తర్వాత తాకట్టు పెట్టిన బంగారాన్ని అదే రోజున లేదా గరిష్ఠంగా ఏడు పని దినాల్లో తిరిగి ఇవ్వాలి. ఒకవేళ బ్యాంకు లేదా NBFC సంస్థలు ఈ గడువులో బంగారాన్ని తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తే.. ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.5,000 చొప్పున వినియోగదారుడికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి: బంగారం విలువ పెరుగుతోందని ఎక్కువ మొత్తంలో రుణం తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. మీ ఆదాయం, నెలవారీ ఖర్చులు, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం దాచుకున్న బంగారు ఆభరణాలను కోల్పోకుండా ఉండాలంటే ముందుగానే రీపేమెంట్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అవసరమైనంత మొత్తానికే రుణం తీసుకోవడం మంచిది.