
ఈపీఎఫ్‌లో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా..? ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా పరిష్కారం అవ్వలేదా..? పీఎఫ్ అధికారులను కలిసి ఎలా ఫిర్యాదు చేయాలనేది తెలియడం లేదా? అయితే మీరు ఇక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖాతాదారుల సమస్యలను పరిష్కరించడానికి మీ వద్దకే పీఎఫ్ అధికారులు వస్తున్నారు. ప్రతీ జిల్లాలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ఖాతాదారుల సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తున్నారు. పీఎఫ్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

ఈపీఎఫ్ఓ అక్టోబర్ 27వ తేదీన దేశవ్యాప్తంగా జిల్లాల్లో నిధి ఆప్కే నికాత్ 2.0 పేరుతో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఈ క్యాంపుల్లో అధికారులు అందుబాటులో ఉంటారు. ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్, ఈపీఎస్ కింద పెన్షన్, ఇన్యూరెస్ స్కీమ్ కింద జీవిత బీమాకు సంబంధించి వాటిల్లో ఏమైనా సమస్యలు ఉన్నా అక్కడికక్కడే అధికారులు పరిష్కరిస్తారు. ఏ ఫిర్యాదుకైనా అక్కడిక్కడే పరిష్కారం చూపుతారు. దీని వల్ల ఉద్యోగులు పీఎఫ్ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అధికారులే మీ జిల్లాలకు వస్తున్నారు.

ఈ శిబిరాల్లో మీరు ఈపీఎఫ్ఓ అధికారులను నేరుగా సంప్రదించి మీ సమస్యలు తెలియజేయవచ్చు. పీఎఫ్ సేవలకు సంబంధించి మీ సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ క్యాంపుల్లో సేవా కియోస్క్‌లు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పీఎఫ్ అధికారులను నేరుగా కలిసి వారితో మాట్లాడుకోవచ్చు. పీఎఫ్ ప్రయోజనాల గురించి ఖాతాదారులకు అధికారులు వివరిస్తారు.

కేవలం ఉద్యోగులకే కాకుండా పీఎఫ్ పెన్షనర్లు, యాజమాన్యాల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంతో పాటు ఇతర సేవలను పొందవచ్చు. ఇక కంపెనీలు కూడా పీఎఫ్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. విశ్వాస్ 2026 పథకం కింద కంపెనీలు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ నష్ట కేసులను పరిష్కరించుకోవచ్చు. ఆన్ లైన్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా నేరుగా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ క్యాంపులు ఉపయోగపడతాయి.

ఈ ప్రత్యేక క్యాంపులు ప్రతీ నెలా 27వ తేదీన జరుగుతాయి. ఒకవేల ఆ రోజు సెలవు ఉంటే తర్వాతి రోజు నిర్వహిస్తారు. https://drive.google.com/file/d/1HewVJW_0yRvRC2N30-Gx8XgdgaRzQoyA/view?usp=sharing లింక్ ద్వారా ఖాతాదారులు తమ సమీపంలోని క్యాంపు వివరాలను తెలుసుకోవచ్చు.