
BSNL Kavach Number: డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, మొబైల్ నంబర్లు మన వ్యక్తిగత గుర్తింపులుగా మారాయి. బ్యాంకింగ్ సేవలు, సోషల్ మీడియా, రైలు టికెట్ బుకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, ఓటీపీలు వంటి అనేక అవసరాల కోసం మనం మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తున్నాం. అయితే చాలా సందర్భాల్లో షాపులు, పబ్లిక్ ప్రదేశాలు లేదా ఇతర సేవల కోసం మన మొబైల్ నంబర్‌ను ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది గోప్యత, భద్రత పరంగా సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

కవచ్ నంబర్: కవచ్ నంబర్(Kavach Number) అనే ఈ సదుపాయాన్ని మహిళల గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ ఫీచర్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున (International Women's Day) సందర్భంగా మార్చి 8న ప్రారంభించారు.

కవచ్ నంబర్ అంటే ఏమిటి?: BSNL అందిస్తున్న కవచ్ నంబర్ ఒక ప్రత్యేక ఫీచర్. దీని ద్వారా మహిళలకు తాత్కాలికంగా ఉపయోగించుకునే మరో 10 అంకెల మొబైల్ నంబర్‌ను అందిస్తుంది. ఈ నంబర్ వినియోగదారుడి అసలు మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది. అంటే ఎక్కడైనా రీచార్జ్ చేయడానికి లేదా పబ్లిక్ ప్రదేశాల్లో మొబైల్ నంబర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అసలు నంబర్ ఇవ్వకుండా ఈ తాత్కాలిక కవచ్ నంబర్‌ను ఇవ్వవచ్చు. దీంతో అసలు మొబైల్ నంబర్ ఇతరులకు తెలియకుండా ఉంటుంది. ఇలా మహిళల ప్రైవసీని కాపాడబడుతుంది.

కవచ్ నంబర్ ఎలా పనిచేస్తుంది?: BSNL ప్రకారం కవచ్ నంబర్ ఒక సెక్యూరిటీ లేయర్ లా పనిచేస్తుంది. వినియోగదారుడికి ఒక తాత్కాలిక 10 అంకెల నంబర్ SMS ద్వారా అందుతుంది. ఈ నంబర్ అసలు మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది. రీచార్జ్ చేసేటప్పుడు అసలు నంబర్ బదులు ఈ కవచ్ నంబర్ ఇవ్వవచ్చు. సిస్టమ్ ఆ తాత్కాలిక నంబర్‌ను గుర్తించి రీచార్జ్‌ను అసలు మొబైల్ నంబర్‌కు చేరుస్తుంది. ఈ విధంగా మొబైల్ నంబర్‌ను బయటివారితో పంచుకోకుండా రీచార్జ్ చేయడం సులభం అవుతుంది.

కవచ్ నంబర్ ఎలా పొందాలి?: BSNL ఈ ఫీచర్‌ను చాలా సులభంగా ఉపయోగించేలా రూపొందించింది. కవచ్ నంబర్ పొందడానికి ఈ దశలను అనుసరించాలి. ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో BSNL Self Care యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. యాప్‌లో లాగిన్ అయిన తర్వాత Kavach Number ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. అక్కడ నుంచి తాత్కాలిక నంబర్‌ను జనరేట్ చేసుకోవచ్చు. ఈ నంబర్ SMS రూపంలో కూడా పొందవచ్చు. అలాగే ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు BSNL అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.