
పిల్లలకు మంచి ప్రోటీన్, ఫైబర్ అందేలా ఆరోగ్యకరమైన ప్రోటీన్ లడ్డు తయారు చేద్దాం. ఇది పిల్లల్లో ఆకలిని తీర్చడమే కాకుండా, ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది, అలాగే చర్మం, జుట్టు, ఎముకలు, గుండె ఆరోగ్యానికి కూడా బాగా పని చేస్తుంది. అలాగే ఇది పాఠశాలకు వెళ్లే పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుంది.

కావాల్సిన పదార్థాలు :, నువ్వులు: 1 కప్పు, అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్): 1/4 కప్పు, గుమ్మడి గింజలు (పంపకైన్ సీడ్స్): 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పులు: 2 టేబుల్ స్పూన్లు (మధ్యకు కట్ చేసినవి), పిస్తా పప్పులు: 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పప్పులు: 2 టేబుల్ స్పూన్లు, సోంపు: 1 టీ స్పూను, యాలకులు: 3-4, వేరుశనగ గుళ్ళు: 2 టేబుల్ స్పూన్లు (పొట్టు తీసినవి), తురిమిన బెల్లం: 1/4 కప్పు, గింజలు తీసిన ఖర్జూరం: 1 కప్పు, నెయ్యి (ఐచ్ఛికం): 1-2 టీ స్పూన్లు

ముందుగా, ఒక మందపాటి కడాయిలో నువ్వులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో అవిసె గింజలను, గుమ్మడి గింజలను విడివిడిగా లో ఫ్లేమ్‌లో వేయించి పక్కన ఉంచాలి. అనంతరం, బాదం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పు పప్పులను గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించి, స్టవ్ ఆఫ్ చేసే ముందు సోంపు , యాలకులను వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఈ వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత, వేరుశనగలు పొట్టు తీసి, కొన్ని డ్రై ఫ్రూట్స్ పాటు కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన అన్ని వేయించిన పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి, అందులో తురిమిన బెల్లం, ఖర్జూరం చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, కొద్దిగా నెయ్యి జోడించి లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ప్రొటీన్ లడ్డూ రెడీ. పిల్లలకు రోజుకు ఒక్కటి ఇస్తే చాలు బలం కాకుండా మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. ప్రతి రోజూ పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో వారి స్నాక్స్ బాక్సులో ఒకటి పెడితే చాలు, ఇష్టంగా తినడమే కాకుండా, ప్రోటీన్ కూడా అందుతుంది.