
బ్లాక్ కాఫీలో పాలు, చక్కెర కలపరు కాబట్టి ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఇది మెదడును చురుగ్గా ఉంచి, శారీరక ఉత్సాహాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు లేదా డయాబెటిస్ నియంత్రణలో ఉన్నవారు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహాతో చక్కెర లేని బ్లాక్ కాఫీని పరిమితంగా తీసుకోవచ్చు. అయితే బ్లాక్ కాఫీని అమితంగా తాగితే నిద్రలేమి, ఆందోళన, గుండె కొట్టుకునే వేగం పెరగడం వంటి సమస్యలు రావచ్చు.

పాలు కలిపిన కాఫీ తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా పాలలో ఉండే పోషకాలను కూడా అందిస్తుంది. పాలు కలపడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రొటీన్లు అందుతాయి. కొంతమందికి బ్లాక్ కాఫీ తాగితే కడుపులో అసిడిటీ లేదా మంటగా అనిపిస్తుంది, అలాంటి వారికి మిల్క్ కాఫీ కడుపులో కాస్త హాయిగా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు మిల్క్ కాఫీని పరిమితంగా తీసుకుంటే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. అయితే మిల్క్ కాఫీలో ఎక్కువ చక్కెర, క్రీమ్ లేదా ఆర్టిఫిషియల్ సిరప్స్ కలిపితే కేలరీలు విపరీతంగా పెరిగిపోయి బరువు పెరిగే ప్రమాదం ఉంది.

ఎవరికి ఏ కాఫీ సరిపోతుందనేది వారి శారీరక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు, అదనపు కేలరీలు వద్దు అనుకునే వారు, షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి బ్లాక్ కాఫీ చక్కటి ఎంపిక. మరోవైపు కాఫీలోని చేదును ఇష్టపడని వారు, కేఫిన్ వల్ల కడుపులో మంట లేదా అసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడే వారు లైట్ గా పాలు కలిపిన కాఫీని ఎంచుకోవడం మంచిది.

పాలు ఉన్నా, లేకపోయినా కాఫీని అమితంగా తాగడం, ఎక్కువ చక్కెర వేసుకోవడం లేదా రోజులో పదే పదే తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కాఫీ తాగడం మానేస్తే మంచి నిద్ర పడుతుంది. కాబట్టి కేవలం రుచి కోసమే కాకుండా మీ శరీర తత్వానికి ఏది సరిపోతుందో చూసుకుని కాఫీని ఎంచుకోవడమే దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కాఫీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. అది ఆరోగ్యానికి ఒక మంచి బూస్టర్ కూడా కాగలదు. కానీ ఇది మనం తాగే పరిమాణంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ ఆహార అలవాట్లు, మీ ఆరోగ్యం, వైద్యుల సలహాలను మనసులో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకోండి. శారీరక దృఢత్వాన్ని కాపాడుకుంటూనే కాఫీ రుచిని ఆస్వాదించండి.