
కావలసిన పదార్థాలు: 1 గ్లాసు బియ్యం రవ్వ, నీటిలో కడిగి అరగంట పాటు నానబెట్టిన పావు గ్లాసు సగ్గుబియ్యం, రవ్వ కొలిచిన గ్లాసుతో 10 గ్లాసుల నీళ్లు, 5 నుండి 6 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు.

తయారీ విధానం: అడుగు మందంగా ఉండే పెద్ద గిన్నెలో 9 గ్లాసుల నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టి మరిగించాలి. మిగిలిన 1 గ్లాసు నీటిని విడిగా ఉంచుకోవాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో ముందుగా నానబెట్టుకున్న పావు గ్లాసు సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించాలి. సగ్గుబియ్యం పైకి తేలి ట్రాన్స్‌పరెంట్‌గా ఉడికేంత వరకు మరిగించాలి.

పక్కన ఉంచిన గ్లాసు నీటిలో ఒక గ్లాసు బియ్యం రవ్వను ఉండలు లేకుండా విడిగా కలుపుకోవచ్చు లేదా మరుగుతున్న ఎసరులో రవ్వను కొద్దికొద్దిగా పోస్తూ గరిటెతో వేగంగా కలపాలి. రవ్వ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో తిప్పుతూ రవ్వ మెత్తగా ఉడికేవరకు ఉడికించాలి. వడియాల పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి; పిండి సరిగ్గా ఉడకకపోతే ఎండలో వడియాలు బీటలు వారి పగిలిపోతాయి.

రవ్వ ముద్దలా ఉడికిన తర్వాత.. కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిర్చి ముద్ద, జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మరో 5 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండిని పూర్తిగా కాకుండా గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి.

ఎండలో ఒక తడి కాటన్ క్లాత్‌ను లేదా ప్లాస్టిక్ షీట్‌ను పరవాలి. గోరువెచ్చని పిండిని చిన్న గరిటెతో తీసుకుంటూ పలుచగా కాకుండా కాస్త మందంగా గుండ్రంగా వడియాల్లా వేసుకోవాలి. సాయంత్రానికి వడియాలు ఒకవైపు ఆరిపోతాయి. క్లాత్‌పై వేసినట్లయితే వెనుక వైపు కొద్దిగా నీళ్లు చిలకరించి నెమ్మదిగా వడియాలను తీసి, రెండో వైపు కూడా మరో రెండు రోజుల పాటు గలగలలాడేలా ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన వడియాలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే ఏడాది పాటు తాజాగా ఉంటాయి. నూనె బాగా కాగిన తర్వాత వీటిని వేస్తే అద్భుతంగా పొంగి తెల్లగా, కరకరలాడుతూ సిద్ధమవుతాయి.