
కావలసిన పదార్థాలు: 5 కిలోలు బాగా మాగిన మేక ఎరువు (మేక ఎరువు లేకపోతే ఆవు పేడ ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వాడవచ్చు), పావు కిలో ఆవపిండి పొడి, పావు కిలో బోన్ మీల్ (ఎముకల పొడి), 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వేపపిండి, ఎరువు వినియోగ మోతాదులు: 5 నుండి 10 ఏళ్ల పెద్ద నేల చెట్లకు – 2½ కిలోలు 1 నుండి 2 ఏళ్ల చిన్న మొక్కలకు లేదా కుండీల్లోని మొక్కలకు – అరకిలో

ఆర్గానిక్ మిశ్రమం తయారీ: ఒక పెద్ద ట్రే లేదా బేసిన్లో 5 కిలోల బాగా మాగిన మేక ఎరువును వేయాలి. ఇందులో పావు కిలో ఆవపిండి పొడి, పావు కిలో బోన్ మీల్, 3 టేబుల్ స్పూన్ల వేపపిండి వేయాలి. చేతులతో లేదా గరిటెతో ఈ నాలుగు ఎరువులు ఒకదానికొకటి సమానంగా కలిసేలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

మొక్క మొదట్లో మట్టి సిద్ధం చేయడం: ఎరువు ఇచ్చే ముందు పండ్ల మొక్క మొదట్లో కాండానికి నేరుగా తగలకుండా, కాండం చుట్టూ అరడుగు నుండి ఒకడుగు వలయాకారంలో పైనున్న మట్టిని 2-3 అంగుళాల లోతు వరకు గరిటె లేదా ఖుర్పాతో మెల్లగా తవ్వి పక్కకు తీయాలి. సన్నటి ఫీడర్ వేర్లు తెగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఎరువు వేయడం & మట్టి కప్పడం: తవ్విన వలయాకార గాడిలో తయారుచేసి ఉంచుకున్న ఎరువుల మిశ్రమాన్ని వేయాలి. పెద్ద చెట్లకు (సపోటా, వాటర్ ఆపిల్ వంటి 10 ఏళ్ల చెట్లకు) రెండున్నర కిలోల వరకు, చిన్న మొక్కలకైతే అరకిలో వరకు సమానంగా పరవాలి. ఆ తర్వాత పక్కకు తీసిన మట్టితో ఎరువు పైభాగం పూర్తిగా కనపడకుండా కప్పి వేయాలి; ఎరువు నేరుగా ఎండకు గురికాకుండా మట్టి కింద ఉంటేనే సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. ఎరువు వేసి మట్టి కప్పిన వెంటనే ఆ ప్రాంతం పూర్తిగా తడిసేలా సమృద్ధిగా నీళ్లు పోయాలి. నీరు పోయడం వల్ల ఎరువులోని పోషకాలు కరిగి వేర్ల ద్వారా మొక్కకు త్వరగా అందుతాయి.

ఎప్పుడు ఏ మొక్కకు వేయాలి? కాపు మొదలయ్యే సీజన్‌కు నెల రోజుల ముందే (నవంబర్ నెలలో) సంవత్సరానికి ఒకేసారి అందించాలి. నిత్య కాపునిచ్చే మొక్కలు (సపోటా, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, మల్బరీ) పూత పిందె నిలబడి, పండ్లు పెద్ద సైజులో రావడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వేయాలి. అంతే, ఈ సహజసిద్ధమైన ఎరువు అందించిన కొద్ది రోజుల్లోనే మొక్క ఆకులు ముదురు పచ్చదనంతో కొత్త చిగుళ్లు తొడిగి.. కొమ్మ కొమ్మకు గుత్తులు గుత్తులుగా పూత పూసి, గంపల కొద్దీ నాణ్యమైన తియ్యటి పండ్ల దిగుబడిని అందిస్తుంది!