
కావలసిన పదార్థాలు.. కోడిగుడ్లు: 3 (ఉడికించినవి), పసుపు: 1/4 టీస్పూన్, కారం: 1/2 టీస్పూన్ (మ్యారినేషన్ కోసం), 1 1/2 టీస్పూన్ (ఉల్లిపాయ పేస్ట్ కోసం), గరం మసాలా: 1/2 టీస్పూన్ (మ్యారినేషన్ కోసం), 1 టీస్పూన్ (చివరిగా), ఉప్పు: 1/4 టీస్పూన్ (మ్యారినేషన్ కోసం), రుచికి సరిపడా (చివరిగా), నిమ్మరసం: 1 1/2 టీస్పూన్ (మ్యారినేషన్ కోసం), 1 1/2 టీస్పూన్ (చివరిగా), నీళ్లు: 1 టీస్పూన్ (మ్యారినేషన్ కోసం), ఉల్లిపాయలు: 1 కప్పు (నిలువుగా తరిగినవి), నూనె: 5 టేబుల్ స్పూన్లు (వేయించడానికి, తాలింపు కోసం), అల్లం: సన్నగా తరిగిన ముక్కలు (లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్), వెల్లుల్లి: సన్నగా తరిగిన ముక్కలు (లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్).. చొప్పున తీసుకోవాలి.

ముందుగా కోడిగుడ్లను ఉడికించి, పొట్టు తీసి, శుభ్రంగా కడిగి ఒక క్లాత్‌తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పావు చెంచా పసుపు, అర చెంచా కారం, అర చెంచా గరం మసాలా, పావు చెంచా ఉప్పు వేసి, ఒకటిన్నర చెంచా నిమ్మరసం, ఒక చెంచా నీళ్లు వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పులుపు ఎక్కువగా కావాలంటే నిమ్మరసం ఇంకొక స్పూన్ అదనంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లకు టూత్‌పిక్‌తో రంధ్రాలు చేసి, ఈ మసాలా మిశ్రమాన్ని గుడ్లకు బాగా పట్టించి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

ఒక కప్పు నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఒకటిన్నర చెంచా కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ ఉల్లిపాయలను మెత్తగా కాకుండా, సన్నగా తరిగినట్లుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ పట్టుకుంటే రవ్వ రవ్వగా తగలాలి. స్టవ్ ఆన్ చేసి బాండీలో మూడు చెంచాల నూనె వేసుకోవాలి. కోడిగుడ్లను వీడియోలో చూపిన విధంగా జాగ్రత్తగా కట్ చేసి, పచ్చసొన, తెల్లసొనలను వేరు చేసుకోవాలి. తెల్లసొనను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసిన కోడిగుడ్ల పచ్చసొన, తెల్లసొన ముక్కలను ఆ నూనెలో విడివిడిగా వేయించుకోవాలి. పచ్చసొన ముక్కలను లో ఫ్లేమ్‌లో పెట్టి మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకొని తీసేయాలి. ఆ తర్వాత తెల్లసొన ముక్కలను కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి గోధుమ రంగులోకి వచ్చి, క్రిస్పీగా మారే వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో మరో రెండు చెంచాల నూనె వేసి కాగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడే కంటే ముక్కలు వాడితేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం పేస్ట్ వేసి నూనె పీల్చుకునే వరకు వేపాలి. ఆ తర్వాత నూనె మళ్ళీ పైకి తేలే వరకు బాగా వేపుతూ ఉండాలి. ఈ దశలో ఒక చెంచా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒకటిన్నర చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు, ముందుగా వేయించుకున్న కోడిగుడ్డు తెల్లసొన ముక్కలను ఈ మిశ్రమంలో వేసి బాగా కలిసేలా చూసుకోవాలి. పచ్చడి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. కోడిగుడ్డు పచ్చసొనను అప్పటికప్పుడు తినే పనైతేనే పచ్చడిలో కలపండి. మీరు పచ్చడిని ఫ్రిజ్‌లో వారం పది రోజుల పాటు నిల్వ ఉంచాలనుకుంటే, పచ్చసొనను కలపకుండా ఉండటమే మంచిది. పచ్చసొన కలపకపోతే ఫ్రిజ్‌లో వారం పది రోజుల పాటు, బయట రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పుల్లపుల్లగా, కార కారంగా ఉండే కోడిగుడ్డు పచ్చడి చల్లటి వాతావరణంలో వేడి వేడి అన్నంతో తినడానికి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ల చేత కలిపించుకొని తింటే ఆ రుచి మరింత ప్రత్యేకం. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది.