
హైదరాబాద్ / అమరావతి: బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని పేర్కొంది.. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్, అమరావతి కేంద్రాలు కీలక ప్రకటన చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. అంతేకాకుండా.. అక్కడక్కడ పిడుగులు, గాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉ:ది.

ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనావేశారు. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.

సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది.

తెలంగాణలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గి, పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.