
భానుడి భగభగలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో బాటు శరీరంలో నీటి శాతం తగ్గి నీరసం, జీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ వేసవిలో మనల్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచేందుకు ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం కలబంద. కేవలం చర్మ సౌందర్యానికే కాకుండా ఆరోగ్యానికి కూడా కలబంద మేలని నిపుణులు సూచిస్తున్నారు.

రోగనిరోధక శక్తికి బూస్ట్: కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి. వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది.

కలబంద రసం తయారీ : మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాల కంటే ఇంట్లోనే తాజాగా తయారుచేసుకునే కలబంద రసం ఎంతో మేలు. తాజా కలబంద ఆకు నుండి గుజ్జును వేరు చేసి, దానిని తగినంత నీటిలో కలపాలి. రుచిని పెంచుకోవడానికి కొద్దిగా నిమ్మరసం, తేనె లేదా నల్ల ఉప్పును కలుపుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు కలబంద రసం తాగడం వల్ల అత్యంత వేగంగా ఫలితాలు కనిపిస్తాయి. ఒకవేళ మార్కెట్లో దొరికే జ్యూస్‌లు వాడాలనుకుంటే, చక్కెర లేనివి ఎంచుకోవడం ఉత్తమం.

బహుముఖ ప్రయోజనాలు: కలబంద రసం కేవలం శరీరాన్ని లోపల నుండి చల్లబరచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం సహజమైన మెరుపును సంతరించుకుంటుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలంగా మారుతాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి: కలబంద రసం ప్రయోజనకరమైనప్పటికీ, అందరికీ ఒకేలా పని చేయకపోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు దీనికి దూరంగా ఉండాలి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని సేవించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించాలి. తక్కువ ఖర్చుతో, సులభంగా లభించే కలబందను మీ దినచర్యలో భాగం చేసుకొని ఈ వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.