
కావలసిన పదార్థాలు: 750 గ్రాముల చేప ముక్కలు, నీళ్లలో నానబెట్టిన 1/3 కప్పు ఎండు ఉసిరికాయ ముక్కలు, 2 నుండి 2½ టేబుల్ స్పూన్ల నల్ల మిరియాలు, పావు టీస్పూన్ మెంతులు, 12 నుండి 15 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 3 నుండి 4 రెమ్మలు తాజా కరివేపాకు, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, రుచికి సరిపడా సాల్ట్, 1/3 కప్పు నీళ్లు. గమనిక: మరింత స్పైసీగా కావాలనుకునే వారు మిరియాలతో పాటు 2-3 పచ్చిమిరపకాయలను కూడా గ్రైండ్ చేసుకోవచ్చు.

తయారీ విధానం: ఒక గిన్నెలో 1/3 కప్పు ఎండు ఉసిరికాయ ముక్కలను వేసి నీళ్లు పోసి కనీసం 1-2 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. ఉసిరి ముక్కలు మెత్తగా ఊరిన తర్వాత నానబెట్టిన నీళ్లతో సహా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో 2 నుండి 2½ టేబుల్ స్పూన్ల నల్ల మిరియాలు, కొద్దిగా ఉప్పు వేసి చాలా మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో పావు టీస్పూన్ మెంతులు వేసి మీడియం మంటపై బాగా నల్లబడేంత వరకు దోరగా వేయించాలి. వేగిన మెంతులను దంచి మెత్తటి పొడి చేసుకోవాలి.

అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి పొగలు వచ్చే వరకు వేడిచేయాలి. ఇందులో 12-15 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వెల్లుల్లి వేగగానే గ్రైండ్ చేసుకున్న ఉసిరి పేస్ట్‌ను వేసి కేవలం ఒక్క నిమిషం మాత్రమే వేపాలి (ఎక్కువ సేపు వేపకూడదు. ఇప్పుడు దంచిన మెంతిపొడి, 1/3 కప్పు నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఉడుకు పట్టించాలి. మిశ్రమం చిక్కటి పేస్ట్‌లా దగ్గరపడగానే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

చల్లారిన ఉసిరి మసాలా మిశ్రమంలో 750 గ్రాముల చేప ముక్కలను వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలపాలి. పైన మరికొన్ని కరివేపాకు రెమ్మలు వేసి కనీసం 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి; దీనివల్ల ఉసిరి పులుపు, మిరియాల ఘాటు ముక్క లోపలి వరకు చక్కగా ఇంకుతాయి. స్టవ్‌పై దోశ పెనం లేదా వెడల్పాటి తవా పెట్టి 4 నుండి 5 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత మ్యారినేట్ చేసిన చేప ముక్కలను ఉసిరి పేస్ట్‌తో సహా పెనంపై పేర్చాలి. పెనాన్ని ఓవర్‌లోడ్ చేయకుండా మంట తగిలే మేరకే ముక్కలను ఉంచాలి.

మూతపెట్టి మీడియం మంటపై కదపకుండా 10 నుండి 12 నిమిషాలు కాల్చాలి. అడుగు భాగం చక్కగా రోస్ట్ అయ్యాక మూత తీసి.. ముక్కలను నెమ్మదిగా రెండో వైపుకు తిరగేయాలి. పైనుంచి మరికొద్దిగా కొబ్బరి నూనె, తాజా కరివేపాకు చల్లి.. ఇప్పుడు మూత పెట్టకుండా మీడియం మంటపైనే నిదానంగా చేప ముక్కలు గారెలలా కరకరలాడే వరకు ఎర్రగా కాల్చుకోవాలి. అంతే, నోరూరించే అదిరిపోయే 'ఆదివాసీ చేపల వేపుడు' సిద్ధం! వేడివేడిగా అరటి ఆకుపై సర్వ్ చేసుకుని స్టార్టర్‌గా తిన్నా, లేదా పప్పుచారు, రసంలోకి నంజుకుని తిన్నా కొబ్బరి నూనె పరిమళం, ఉసిరి-మిరియాల అద్భుతమైన ఘాటుతో జీవితంలో మర్చిపోలేని సరికొత్త రుచిని అందిస్తుంది!