
ఉప్పు కలిపే విషయంలో జాగ్రత్త: మనం చేసే అతిపెద్ద పొరపాటు గుడ్లను గిలకొట్టే ప్రారంభంలోనే ఉప్పు కలపడం. ఇలా చేయడం వల్ల గుడ్డులోని ప్రోటీన్ నిర్మాణం దెబ్బతిని, అది తేమను త్వరగా కోల్పోతుంది. ఫలితంగా ఆమ్లెట్ మృదుత్వాన్ని కోల్పోయి రబ్బరులా లేదా మందంగా తయారవుతుంది. గుడ్డు మిశ్రమాన్ని పెనంపై పోయడానికి కొన్ని సెకన్ల ముందు మాత్రమే ఉప్పు కలపండి. దీనివల్ల ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది.

కూరగాయలతోనే పోషకాలు: చాలామంది కేవలం గుడ్డును మాత్రమే పగలగొట్టి ఉప్పు, కారం వేసి ఆమ్లెట్ వేసుకుంటారు. కానీ ఇందులో పీచుపదార్థం లోపిస్తుంది. కేవలం గుడ్లను మాత్రమే తీసుకోవడం వల్ల కలిగే అసమతుల్యతను పోగొట్టాలంటే తప్పనిసరిగా కూరగాయలను చేర్చుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలతో పాటు పాలకూర, క్యాప్సికమ్ లేదా క్యారెట్ తురుమును కూడా వాడవచ్చు. పీచుపదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు చేర్చడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

పచ్చిగా వద్దు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను నేరుగా గుడ్డు మిశ్రమంలో వేసి పెనంపై పోస్తే, ఆ తక్కువ సమయంలో కూరగాయలు సరిగ్గా ఉడకవు. దీనివల్ల తింటున్నప్పుడు పచ్చి వాసన రావడమే కాకుండా రుచి తగ్గుతుంది. ముందుగా బాణలిలో కొద్దిగా నూనె లేదా వెన్న వేసి కూరగాయలను దోరగా వేయించాలి. అవి సగం ఉడికిన తర్వాత మాత్రమే సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని అందులో కలపాలి. ఇలా చేయడం వల్ల కూరగాయల్లోని సహజమైన రుచి ఆమ్లెట్‌కు పడుతుంది.

ఆమ్లెట్ vs హాఫ్ బాయిల్: చాలామంది గుడ్డును పగలగొట్టి రెండు వైపులా కాల్చడాన్ని ఆమ్లెట్ అనుకుంటారు. సాంకేతికంగా ఇది ఆమ్లెట్ కాకపోయినప్పటికీ ఆరోగ్యకరమే. అయితే ఆమ్లెట్ అంటే అన్ని పదార్థాలను సమపాళ్లలో కలిపి ఒక పద్ధతి ప్రకారం వండటం. వండేటప్పుడు మరీ ఎక్కువ నూనె వాడకుండా, తక్కువ మంటపై కాల్చడం వల్ల గుడ్డులోని పోషకాలు ఆవిరి కాకుండా ఉంటాయి.

చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఆమ్లెట్ తయారీలో మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే, అది కేవలం కడుపు నింపే ఆహారమే కాకుండా శరీరానికి అవసరమైన పూర్తిస్థాయి ప్రోటీన్లు, విటమిన్లు అందించే అద్భుతమైన ఆరోగ్య వనరుగా మారుతుంది.