
తెలంగాణలో ఫంక్షన్లలో ప్రత్యేకంగా వండే దావత్ స్టైల్ మటన్ కర్రీ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి స్పైసీగా, ఘాటుగా, చిక్కటి గ్రేవీతో యమ్మీగా ఉండే ఈ వంటకాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో చూద్దాం.. ఒక్కసారి ఈ రెసిపీని ప్రయత్నిస్తే, తప్పకుండా మీరు సూపర్ అనాల్సిందే..

కావాల్సిన పదార్థాలు: లేత మటన్: అరకిలో కేజీ, నూనె: 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు: జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, బండ పువ్వు (కొద్దిగా), పచ్చిమిర్చి: 4-5, ఉల్లిపాయలు: 2 మీడియం సైజు, పుదీనా: కొద్దిగా, కసూరి మేతి: 1 1/2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టీ స్పూన్లు, ఉప్పు: 1 టీ స్పూన్ + రుచికి సరిపడా, పసుపు: అర టీ స్పూన్, కారం: 1 1/2 టేబుల్ స్పూన్లు (రుచికి తగ్గట్టు) టమాటా: 1 మీడియం సైజు, నీళ్లు: 1 1/2 గ్లాసులు, కొత్తిమీర: కొద్దిగా, ధనియాలు: 2 టీ స్పూన్లు, జీలకర్ర: 1/2 టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు: 1 టేబుల్ స్పూన్, యాలకులు: 4, మిరియాలు: 1/2 టీ స్పూన్, లవంగాలు: 5, షాజీరా: 1/2 టీ స్పూన్, జీడిపప్పులు: 6, గసగసాలు: 1 టీ స్పూన్ తీసుకోవాలి.

ముందుగా అర కేజీ లేత మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. లేత మటన్ అయితే కూర రుచిగా, తొందరగా ఉడుకుతుంది. కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత జాపత్రి, అనాస పువ్వు, నల్ల యాలక్క, బిర్యానీ ఆకు, బండ పువ్వు వేసి దోరగా వేయించాలి. ఈ మసాలా దినుసులు వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది.మసాలా దినుసులు వేగిన తర్వాత, నాలుగు లేదా ఐదు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, మీడియం సైజు రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు రంగు మారి మెత్తబడేంత వరకు వేయించాలి. దీనికి రెండు మూడు నిమిషాలు పడుతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత, కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా, 1 1/2 టీ స్పూన్ల కసూరి మేతి వేసి లైట్ గా వేయించాలి. పుదీనా, కసూరి మేతి ఫ్లేవర్ మటన్‌కు చక్కటి రుచినిస్తాయి.

రెండు టీ స్పూన్ల తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తాజాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడటం వల్ల కూరకు మరింత రుచి వస్తుంది.ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్, ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి, మీడియం ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు బాగా కలపాలి. మటన్ నూనెలో కాస్త వేగాలి, అప్పుడే పుదీనా, కసూరి మేతి ఫ్లేవర్స్ మటన్‌కు పడతాయి. కుక్కర్‌కు మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో పది నిమిషాలు ఉడకనివ్వాలి. మటన్ నుండి నీళ్లు ఊరి, అవి పూర్తిగా ఇంకిపోయి, నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఈలోపు ఒక ప్యాన్‌లో రెండు టీ స్పూన్ల ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, నాలుగు యాలకులు, అర టీ స్పూన్ మిరియాలు, ఐదు లవంగాలు, 1 1/2 ఇంచ్ చెక్క, అర టీ స్పూన్ షాజీరా, ఆరు జీడిపప్పులు వేసి, లో ఫ్లేమ్‌లో మాడకుండా దోరగా వేయించాలి. చివరిలో ఒక టీ స్పూన్ గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసి, ఆ వేడికే వేయించాలి. ఈ వేయించిన మసాలా దినుసులను మిక్సీ జార్లో తీసుకుని, ముందు మెత్తగా గ్రైండ్ చేసి, తరువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌గా చేసుకోవాలి.

మటన్ ఉడికి, నూనె పైకి తేలిన తర్వాత, 1 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక మీడియం సైజు టమాటా ముక్కలు, సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసి, లో ఫ్లేమ్‌లో రెండు మూడు నిమిషాలు బాగా కలిపి వేయించాలి. మసాలా అడుగంటకుండా చూసుకోవాలి. 1 1/2 గ్లాసుల నీళ్లు పోసి, బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో మిగిలిన మసాలా పేస్ట్‌లో కొద్దిగా నీళ్లు పోసి కడిగి వేయవచ్చు. ఈ దశలో ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసి, అవసరమైతే వేసుకోవాలి. కుక్కర్‌కు మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో ఐదు విజిల్స్ రానివ్వాలి. మటన్ కాస్త ముదురుది అయితే ఒకటి లేదా రెండు విజిల్స్ ఎక్కువ ఇవ్వవచ్చు. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే ఘాటైన, స్పైసీ తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ సిద్ధంగా ఉంటుంది. గ్రేవీ కాస్త పలుచగా అనిపిస్తే, ఇంకొద్దిసేపు ఉడికించుకోవచ్చు. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలుపుకోవాలి. ఈ మటన్ కూర రైస్, బగారా రైస్, చపాతీ, రోటీలలోకి చాలా చాలా బాగుంటుంది.