Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

ఎన్.ఆర్.సీ. అమలులో ముందడుగే మంచిది

nrc uproar in india, ఎన్.ఆర్.సీ. అమలులో ముందడుగే మంచిది

భారత దేశానికి దాదాపు పది వేల కిలోమీటర్ల మేరకు వివిధ దేశాలతో భూ సరిహద్దు వుంది. అందులో సుమారు ఆరువేల కిలోమీటర్ల మేరకు ఓపెన్ బోర్డర్ వుండడం మన దేశంలోకి విదేశాల నుంచి చొరుబాటు దారులు వచ్చేందుకు అనుకూలంగా మారింది. మరీ ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో కలిసి వున్న భూ సరిహద్దు ద్వారా మనదేశంలోకి చొరుబాటుదారులు చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు. భద్రతాదళాల పహారా పెద్దగా లేకపోవడంతో ఎవరైనా సులభంగా దేశంలోనికి సరిహద్దు దాటి రావచ్చు .. వెళ్ళవచ్చు… అన్నట్టుగా మారింది పరిస్థితి.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కోట్లాది మంది మనదేశంలోని వచ్చి.. ఇక్కడ శాశ్వత నివాసులుగా మారిపోయారు. వచ్చిన వెంటనే భారతీయ ఓటు హక్కు పొంది స్థానికులుగా చెలామణీ అవుతున్నారు. మన సిస్టమ్‌లో స్క్రూటినీ అనేది పెద్దగా లేకపోవడంతో ఇక్కడి పౌరులుగా మారిపోయిన వారి సంఖ్య కోట్లలోనే వుందని భావిస్తున్నారు. ఉదాహరణకు అస్సోం రాష్ట్రంలో అక్కడి స్థానిక జనాభా కాకుండా అదనంగా 40-50 శాతం మంది అక్రమంగా వలస వచ్చి.. స్థానికులుగా మారిపోయారు. వారి సంఖ్య బాగా పెరిగిపోయి స్థానిక ప్రభుత్వాలను మార్చే స్థాయికి ఎదిగిపోయారు. ఇలా వచ్చి సెటిలైన వారిలో కొందరు ఏకంగా రాజకీయ పార్టీల్లో చేరి, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న అంశం ఆందోళన కలిగించే విషయమే.

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్.ఆర్.సీ) పేరిట దేశంలోకి అక్రమంగా ఎంటరై ఇక్కడే నివసిస్తున్న చొరుబాటు దారులను గుర్తించడం 1987లో మొదలైంది. కొన్ని నిబంధనల ఆధారంగా అక్రమ చొరబాటు దారులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. ఎవరైనా బయట్నించి వచ్చి ఇక్కడ సెటిలైతే.. వారిని గుర్తించడం వారి ఓటు హక్కును తొలగించడం మొదలైంది. అయితే.. ఇక్కడే కొందరు నాయకులు రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లతో రాజకీయం చేస్తున్న వారంతా ఎన్.ఆర్.సీ.ని వ్యతిరేకించడం ప్రారంభించారు.

నిజానికి 1987లో మొదలైన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్.ఆర్.సీ) ప్రక్రియ గత మూడేళ్ళలో అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి రెండేళ్ళ కాలంతో వేగవంతమైంది. ముందుగా అసోంలో నిర్వహించిన సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్క అసోంలోనే 50 లక్షల మంది అక్రమ వలసదారులున్నారని అనుమానాలు వ్యక్తమైనా.. చివరికి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్.ఆర్.సీ) వెల్లడించిన వివరాలలో 20 లక్షల మంది అక్రమ నివాసులున్నట్లు తేలింది. అసోం సిటిజన్స్ వివరాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి.

చాలా చిన్న రాష్ట్రమైన అసోంలోనే 20 లక్షల మంది అక్రమ విదేశీ వలస దారులు వుంటే దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది వున్నారనే చర్చ మొదలైంది. వీరంత ఎక్కడ్నించి వచ్చారు ? ఏ దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో ఇండియాలోకి చొరబడ్డారు ? ఈ చర్చ ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసేదిగా మారింది. ఇలా కోట్లాది మంది విదేశీయులు దేశంలోకి అక్రమంగా చొరబడి, ఇక్కడి పౌరులుగా మారిపోతే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతలా వుంటుందన్నవిశ్లేషణలు తెరమీదికి వచ్చాయి. ఇలా వచ్చిన వారికి దేశం అంటే భక్తిభావం, లాయల్టీ వుంటుందా అన్న చర్చ కూడా మొదలైంది. ఇలా వచ్చిన వారి కచ్చితంగా దేశం పట్ల విశ్వసనీయత, భక్తి భావం వుండవన్నది నిర్వివాదాంశం.

ఇదే క్రమంలో దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాద కార్యకలాపాలు కూడా వీరి చలవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోకి ఇలా చొరబడే వారిలో ఎక్కువ మంది ఉగ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్‌గా మారిపోతున్నారన్న ఇంటెలిజెన్స్ నివేదికలు రాబోయే పెను ప్రమాదాలను సూచిస్తున్నాయి. అందుకే ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్.ఆర్.సీ) సర్వే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో నిర్వహించాలా ? లేక కొన్ని రాష్ట్రాలలో నిర్వహించాలా అన్న చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైంది.

ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ రాష్ట్రాలలో కూడా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్.ఆర్.సీ) సర్వే నిర్వహించాలని స్వచ్ఛందంగా కోరుతున్నాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో అసోంలో వెల్లడైన విషయాలు చాలా మందికి గట్టి సందేశాన్ని పంపించాయనే చెప్పాలి. దేశంలోకి ఎంటరై, కొంతకాలం ఇక్కడ సెటిల్ అయినా.. ఆ తర్వాత ఎప్పటికైనా గుర్తించి వెనక్కి పంపించి వేస్తారన్న భయం అక్రమ వలసదారుల్లో మొదలైంది.

ప్రతీ ఒక్క పౌరునికి సంబంధించి, కొన్ని తరాల వెనక్కి వెళ్ళి మరీ వివరాలు సేకరించేందుకు చేసే ప్రయత్నమే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్.ఆర్.సీ). పౌరులే స్వయంగా వారికి సంబంధించిన నిరూపణ పత్రాలను ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియ అత్యంత అవసరమని నా అభిప్రాయం. అదే సమయంలో దీన్ని దుర్వినియోగాన్ని మాత్రం కచ్చితంగా అరికట్టాలి. దేశంలోని విదేశీ వర్కర్లు రావద్దని అనడం లేదు.. వారంతా సరైన వర్క్ పర్మిట్లతో వచ్చి అవసరమైతే తమ కుటుంబీకులతో కలిసి ఇక్కడ జీవించ వచ్చు.
కానీ సిటిజన్‌షిప్ పేరిట ఎక్కడో బంగ్లాదేశ్‌లో బస్ ఎక్కి.. 44-46 గంటల్లో హైదరాబాద్‌లో దిగిపోయి ఇక్కడ సెటిలైపోవడం మాత్రం ప్రోత్సహించదగినది కాదు. ఇలాంటి వారికి దేశ సరిహద్దులోనే ఆధార్ కార్డు క్రియేట్ చేసి ఇచ్చే బ్రోకర్లు తయారయ్యారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా వుందో అర్థం చేసుకోవచ్చు. దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం వంటివి ఇలాంటి అక్రమ చొరుబాటు దారులతో ప్రభావితం అవుతాయి. వీరిని ఓటుబ్యాంకులుగా భావించే రాజకీయ నేతలు పెరిగితే అది దేశానికే ప్రమాదకరం.

150 ఏళ్ళ క్రితం సుప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో “No force in the world can stop an idea whose time has come” అన్నట్లు.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అమలుకు సంబంధించిన అంశాలపై క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతోంది. ఎన్.ఆర్.సీ. అమలును ముందుకు తీసుకువెళ్ళడమే మంచిది. ఈ మంచి అవకాశాన్ని మోదీ ప్రభుత్వం వదల కూడదు. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించ వచ్చు గాక, పార్లమెంటు వేదికగా విపక్షాలు గగ్గోలు పెట్టవచ్చు గాక.. కానీ ఎన్.ఆర్.సీ. అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. మన దేశానికి ఓపెన్ బోర్డర్లు వుండడం మనకు పెద్ద ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. అందుకే దేశ రక్షణ ముందు ఈ అభ్యంతరాలు అన్నీ చిన్నవిగానే భావించాలి. ఎన్.ఆర్.సీ. సర్వేపై ముందడుగు వేయాలనే అంశం ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను కుదిపేసే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై మోదీ సర్కార్ ఎంత ఫర్మ్‌గా వుంటుందో వేచి చూడాలి.