AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యమునా ఎక్స్‌ప్రెస్‌వే బస్సు ప్రమాదం: ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్.. ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!

గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రైవేట్ స్లీపర్ బస్సు తగ‌లబడి తొమ్మిది మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ నుంచి మహోబా వైపు వెళ్తున్న రాజ్ కల్పనా ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సులో ఏసీ యూనిట్ పేలి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనపై జేవార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (FIR) లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

యమునా ఎక్స్‌ప్రెస్‌వే బస్సు ప్రమాదం: ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్.. ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
Yamuna Expressway Bus Fire
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Sep 24, 2026 | 10:15 AM

Share

గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి మహోబా వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బుధవారం (సెప్టెంబర్23) రాత్రి 11:30 గంటల ప్రాంతంలో జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానత్‌పూర్ సమీపంలో ఈ విషాదకర ఘటన జరిగింది. రాజ్ కల్పనా ట్రావెల్స్‌కు చెందిన ఈ ప్రైవేట్ బస్సులో ప్రమాదం జరిగే సమయంలో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో కొందరు ప్రయాణికులు కిటికీల నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, మంటలు, పొగలో చిక్కుకుపోయి మహిళలు, వృద్ధులు సహా 9 మంది దుర్మరణం చెందారు.కొందరికి కాలిన గాయాలయ్యాయి..తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే జేవార్‌లోని కైలాష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు లగేజీ కంపార్ట్‌మెంట్, పైకప్పుపై ఉంచిన ప్రయాణికుల బ్యాగులు, మొబైల్ ఫోన్లు, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఏసీ యూనిట్ పేలుడే కారణం !

ఫైర్ అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం.. బస్సులోని ఏసీ యూనిట్ పేలడం కారణంగా మంటలు చెలరేగి, ఇంజన్ వద్ద నుంచి వాహనమంతా వేగంగా వ్యాపించాయని వెల్లడైంది.

డ్రైవర్, కండక్టర్ల నిర్లక్ష్యమే కారణమన్న ప్రయాణికులు

ఈ ప్రమాదంపై ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించారు. బస్సు డ్రైవర్ క్యాబిన్ నుంచి కొద్దిసేపటి ముందే కాలిపోతున్న వాసన వస్తోందని ప్రయాణికులు గమనించి, వెంటనే బస్సు ఆపాలని డ్రైవర్, కండక్టర్‌లను కోరారు. కానీ, వారు దానిని పట్టించుకోలేదు.. బస్సులో అలాంటి వాసన రావడం సాధారణమేనంటూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ సీటు దగ్గర మంటలు చెలరేగి వాహనమంతా వ్యాపించినా డ్రైవర్ బస్సును ఆపలేదని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. డ్రైవర్, కండక్టర్ క్యాబిన్ లోపల సిగరెట్లు తగినట్లుగా కూడా ప్రయాణికులు ఆరోపించారు..

ఇవి కూడా చదవండి

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రయాణికుల ఫిర్యాదు ఆధారంగా జేవార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలను సేకరిస్తున్న పోలీసులు.. పరారీలో ఉన్న డ్రైవర్, కండక్టర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us