
మహారాష్ట్ర: వేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ స్కూటీని ఢీకొట్టింది. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్న సమయంలో ఆ యువతి అసాధారణ ధైర్యం ప్రదర్శించింది. లారీ బంపర్‌ను గట్టిగా పట్టుకోవడంతో దాని కింద పడకుండా తృటిలో ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి సమయస్ఫూర్తి, ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్కూటీని ఢీకొట్టిన ఇసుక లారీ
వైరల్ అవుతున్న సుమారు రెండు నిమిషాల సీసీటీవీ ఫుటేజీలో.. బేలాపూర్ రోడ్డుపై ఇసుకతో నిండిన లారీ వేగంగా వస్తోంది. ఓ ప్రాంతానికి చేరుకున్న తర్వాత లారీ ఒక్కసారిగా కుడివైపు మలుపు తిరిగింది. అదే సమయంలో అటువైపు నుంచి స్కూటీపై వస్తున్న యువతిని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీ లారీ కిందకు వెళ్లే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆ సమయంలో యువతి అప్రమత్తంగా స్పందించింది. లారీ బంపర్‌ను గట్టిగా పట్టుకోవడంతో దాని కింద పడకుండా బయటపడగలిగింది. లారీ ఆగిన తర్వాత ఆమె నెమ్మదిగా పైకి లేచి అక్కడి నుంచి వెళ్లింది. చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమె పరిస్థితిని ఎలా ఉందని పరిశీలించారు.
స్థానికులను చూసి పరారైన డ్రైవర్?
ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి లారీ డ్రైవర్ వాహనం నుంచి కిందకు దిగి స్కూటీని పరిశీలించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది. అక్కడున్న వారితో అతడు వాగ్వాదానికి దిగాడు. స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇసుక లారీల వేగంపై ఆందోళన
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ప్రమాదానికి కారణమైన లారీకి నంబర్ ప్లేట్ లేదని, వైజాపూర్‌లోని మహల్‌గావ్ ఇసుక వేలంతో సంబంధం ఉన్న వాహనంగా అనుమానిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ వివరాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఘటనతో ప్రాంతంలో ఇసుక లారీల వేగం, రహదారి భద్రత, వాహనాల నిబంధనల అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. యువతి ప్రాణాలతో బయటపడటం ఊరటనిచ్చినా, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి..
In Shrirampur, Maharashtra, a sand lorry crashed into a scooter, crushing it, but a young boy clung to the lorry’s bumper and escaped with his life by a hair’s breadth thanks to his timely wit. This spine-chilling CCTV footage
#CCTV #Maharashtra https://t.co/y2tDnrTkXM
— Siraj Noorani (@sirajnoorani) October 9, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..