
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య జరుగుతున్న చర్చలు హీట్ పెంచుతున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి విడత చర్చల్లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో.. నిన్న మరోసారి చర్చలు చేశారు. గతంలో 181 సీట్లు కావాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.. కొంచెం వెనక్కి తగ్గి 130 సీట్ల జాబితాను ఎస్పీ నేతల ముందుంచింది. అటు.. కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు నడుస్తుండగానే.. 26 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ సుముఖత వ్యక్తం చేసినట్టు రాజీవ్ రాయ్ వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో గెలుపే లక్ష్యంగా సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాలతో పాటు.. రెండో స్థానంలో నిలిచిన నాలుగు స్థానాలు, మరో 20 నియోజకవర్గాలను జాబితాలో చేర్చినట్టు తెలిపారు.
ఇక.. ఎస్పీ 26 సీట్ల ప్రతిపాదనపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తామేమీ సీట్ల కోసం అడుక్కోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఏకపక్షంగా ఐదు స్థానాలకు తొలి జాబితాను ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. అఖిలేశ్ యాదవ్ సహాయం కోసం ఎదురుచూసే “బిచ్చగాళ్లం” కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు
యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం షామ్లీ, అమ్రోహా, లలిత్పూర్తో పాటు సహారన్‌పూర్‌లోని బెహత్, సహారన్పూర్ రూరల్ నియోజకవర్గాలకు సమాజ్‌వాదీ పార్టీ తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. వాస్తవానికి సహారన్పూర్ రూరల్, బెహత్ స్థానాలను పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు సమాచారం. దీని సహారన్పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇమ్రాన్ మసూద్ ఈ నిర్ణయంపై మండిపడ్డారు. పొత్తు చర్చల మధ్య ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాకతీ.. సమాజ్‌వాదీ పార్టీ పొత్తు పట్ల నిజాయితీగా ఉందా లేదా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. “ఎస్పీ ప్రకటన వల్ల మాకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఈ పోరాటం బీజేపీకి వ్యతిరేకమా లేక కాంగ్రెస్‌కు వ్యతిరేకమా అన్నది కచ్చితంగా తేలాలి. ఇలా ప్రవర్తిస్తే ఇక పొత్తు ఎక్కడ ఉన్నట్లు?” అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు పనిచేస్తాయని, అవసరమైన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపుతుందని మసూద్ స్పష్టం చేశారు.
అయితే.. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో గెలుపే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు ఉంటుందని ఎస్పీ అధినేత అఖిలేష్‌యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం.. ముందుగా గెలిచే 26 సీట్లతో చర్చలు ప్రారంభమయ్యాయని.. పరస్పర అవగాహనతో తదుపరి చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇదిలావుంటే.. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేయగా ఘోర పరాజయం ఎదురైంది. 107 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. కేవలం ఏడు సీట్లే గెలుచుకుంది. అఖిలేష్‌యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ 47 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు పార్టీలు ఇప్పుడు మరోసారి జతకట్టాయి. ఈసారి ఎలాగైనా ఉత్తర్‌ప్రదేశ్‌ను నెగ్గి తీరాలని ఎస్పీ-కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి.