BJP: కమలనాథులకు గుబులురేపుతున్న ఆ రెండు రాష్ట్రాలు..

| Edited By: Srikar T

Jan 08, 2024 | 6:29 AM

ఈ మధ్యనే జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం, పూర్తయిన రామమందిర నిర్మాణం, సంస్థాగతంగా బలమైన నిర్మాణం.. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న కమలనాథుల కలలకు ఓ రెండు రాష్ట్రాలు గుబులు రేపుతున్నాయి. 2014 కంటే 2019లో మరిన్ని అధిక సీట్లు సాధించడంలో తోడ్పడ్డ ఆ రెండు రాష్ట్రాలు ఇప్పుడు కాషాయదళానికి సవాల్ విసురుతున్నాయి.

BJP: కమలనాథులకు గుబులురేపుతున్న ఆ రెండు రాష్ట్రాలు..
Bjp
Follow us on

ఈ మధ్యనే జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం, పూర్తయిన రామమందిర నిర్మాణం, సంస్థాగతంగా బలమైన నిర్మాణం.. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న కమలనాథుల కలలకు ఓ రెండు రాష్ట్రాలు గుబులు రేపుతున్నాయి. 2014 కంటే 2019లో మరిన్ని అధిక సీట్లు సాధించడంలో తోడ్పడ్డ ఆ రెండు రాష్ట్రాలు ఇప్పుడు కాషాయదళానికి సవాల్ విసురుతున్నాయి. ‘టార్గెట్ 50%’ – ‘మిషన్ 400 ప్లస్’ అనుకుంటూ లక్ష్యాలు నిర్దేశించుకున్నప్పటికీ.. ఆ రాష్ట్రాల్లో ప్రత్యర్థుల కలయిక బీజేపీ విజయావకాశాలకు గండికొట్టేలా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మరెక్కడా అంతగా పట్టులేదన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మళ్లీ ఆ రికార్డును సమం చేయడం కూడా అంత సులభమేమీ కాదు. వీటికి తోడు గత ఎన్నికల్లో భారీగా సీట్లను అందించిన కొన్ని రాష్ట్రాల్లో ప్రతికూలతలు తోడయ్యాయి. ఇంతకీ అవి ఏ రాష్ట్రాలు? ఎందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రతికూలంగా మారాయి?

మహారాష్ట్ర:

గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (NDA) కూటమికి భారీగా సీట్లను కట్టబెట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఈ రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు బీజేపీ 25 సీట్లలో, నాడు మిత్రపక్షంగా ఉన్న శివసేన 23 సీట్లలో పోటీ చేశాయి. బీజేపీ పోటీ చేసిన చోట ఓ 2 స్థానాలు మాత్రమే కోల్పోయి 23 చోట్ల విజయం సాధించగా, శివసేన 18 స్థానాల్లో గెలుపొందింది. మొత్తంగా కూటమికి 48 స్థానాల్లో 41 స్థానాలు దక్కాయి. ఓట్లశాతం ప్రకారం చూసినా ఈ రెండు పార్టీలకు కలిపి 50.88 శాతం ఓట్లు దక్కాయి. ఈ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని నాటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA)లో భాగంగా కాంగ్రెస్, ఎన్సీపీ సహా మరో రెండు పార్టీలు కలిసి పోటీ చేయగా 34.24 ఓట్ల శాతంతో 5 సీట్లు మాత్రమే గెలవగలిగాయి.

సార్వత్రిక ఎన్నికలు జరిగిన 2019లోనే అక్టోబర్ నెలలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ, శివసేన కూటమి గెలుపొందింది. బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందగా, శివసేన 56 స్థానాలు దక్కించుకుంది. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే శివసేనకు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం లేదు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఇష్టపడని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, తమ రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పదవిని కొన్నాళ్లు అనుభవించారు. అయితే ఆ తర్వాత కమలనాథులు ఆపరేషన్ చేపట్టి ఏక్‌నాథ్ షిండేను అస్త్రంగా మలిచి ప్రభుత్వాన్ని కూలదోసింది. కొన్నాళ్లకు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లోనూ చీలికను తీసుకొచ్చి తమ జట్టులో చేర్చుకుంది. ఈ చర్యలతో ప్రభుత్వాన్నైతే ఏర్పాటు చేయగలిగింది కానీ, ఆయా పార్టీల ఓటుబ్యాంకును తమ జట్టు ఖాతాలో ఎంతమేర వేసుకుంటుందన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఎందుకంటే శివసేనలో మెజారిటీ క్యాడర్ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని చీలిక వర్గం వెంటనే నడిచే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎన్సీపీలోని చీలిక వర్గంలో శరద్ పవార్‌ వర్గానికే ఎక్కువ బలం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అంటే ఒకరకంగా బీజేపీ సొంత బలానికి మిత్రపక్షాలతో కలిసే అదనపు బలం చాలా తక్కువే అని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థులను గతంలో మాదిరిగా కట్టడి చేయడం అంత సులభం కాదని స్పష్టమవుతోంది. గతంలో సాధించిన 41 సీట్లు ఇప్పుడు సాధించడం సాధ్యం కాదు.

ఇవి కూడా చదవండి

ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజల్ని ఆకట్టుకునేందుకు అనేక అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన కార్యక్రమాలు చేపడుతోంది. జనవరి 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైలో 27వ నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను ప్రారంభించడంతో పాటు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రారంభించనున్నారు. నవీ ముంబైలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కేవలం అభివృద్ధి పనులతోనే ఓటర్లను పూర్తిగా తమవైపు తిప్పుకోవడం సాధ్యంకాదని కమలనాథులకు తెలుసు. సంస్థాగతంగానూ పార్టీని ప్రతి గ్రామంలో బలోపేతం చేసే దిశగా గత కొన్నాళ్లుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటికి తోడు అయోధ్య రామమందిరం అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బలం పెంచుకునే ప్రయత్నాల్లో కాషాయదళం ఉంది.

బిహార్:

మహారాష్ట్ర కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బిహార్ ఎన్డీఏ కూటమికి గెలుపు అందించింది. రాష్ట్రంలోని మొత్తం 40 సీట్లలో బీజేపీ 17, అప్పుడు మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్) 17, లోక్‌జనశక్తి పార్టీ 6 సీట్లలో పోటీ చేశాయి. వాటిలో బీజేపీ 17కు 17, లోక్‌జనశక్తి 6కు 6 సీట్లలో గెలుపొందగా, జేడీ(యూ) 17కు 16 సీట్లలో గెలుపొందింది. అంటే మొత్తంగా 40 సీట్లకు కూటమి 39 గెలుచుకుంది. ఒకే ఒక్క సీటులో యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ గెలుపొందింది. 19 స్థానాల్లో పోటీ చేసిన రాష్ట్రీయ లోక్‌దళ్ (RJD), 5 సీట్లలో పోటీ చేసిన RLSP పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. ఓట్లశాతం ప్రకారం చూసినా సరే ఎన్డీఏ కూటమికి 53.25 శాతం ఓట్లు రాగా, యూపీఏ కూటమికి 30.61 శాతం మాత్రమే వచ్చాయి.

బిహార్‌లోనూ మహారాష్ట్ర తరహాలో ఎన్డీఏ కూటమి నుంచి ప్రధాన మిత్రపక్షం జేడీ(యూ) వేరుపడింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు I.N.D.I.A కూటమి ఏర్పాటులోనూ జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. పాట్నాలో నిర్వహించిన విపక్షాల తొలి సమావేశంతోనే గ్రాండ్ అలయన్స్ ఏర్పాటుకు బీజం పడింది. నితీశ్ తనను తాను ప్రధాని అభ్యర్థిగానూ పరోక్షంగా ప్రకటించుకుంటున్నారు. రాష్ట్రంలో జేడీ(యూ), ఆర్జేడీ బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ఈ కూటమికి అదనంగా చేరుతుంది. ఇక్కడ బీజేపీకి మిత్రపక్షంగా కేవలం లోక్‌జనశక్తి పార్టీ మాత్రమే మిగిలింది. దీంతో ఆ రాష్ట్రంలో I.N.D.I.A కూటమిని ఢీకొట్టాలంటే బీజేపీ నిర్దేశించుకున్న “టార్గెట్ 50%” ఓట్లు సాధించక తప్పదు. అప్పుడు మాత్రమే మిగతా పార్టీలన్నీ కలిసినా సరే బీజేపీ విజయాన్ని ఆపలేని పరిస్థితిని సృష్టించవచ్చు. కానీ రాష్ట్రంలో సామాజిక బలాబలాలు మరోలా ఉన్నాయి. కొన్ని స్థానాల్లో బీజేపీని బలంగా వ్యతిరేకించే మైనారిటీ వర్గాల సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో జేడీ(యూ), ఆర్జేడీ పార్టీల సాంప్రదాయ ఓటుబ్యాంకు బలంగా ఉంది. దీంతో ఇక్కడ గతంలో గెలుపొందిన 39 సీట్లు ఈసారి ఎన్డీఏకు సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ రామమందిరం అంశం భావోద్వేగంగా అందరినీ కదిలించి, హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా ఒకవైపే పరుగులు తీస్తే తప్ప బీజేపీ ఈస్థాయిలో సీట్లను అందుకోలేదు.

ఈ పరిస్థితుల్లో బీజేపీ బిహార్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా ఈ రాష్ట్రంలో వీలైనంత ఎక్కువగా పర్యటించేలా ప్రణాళికలు రూపొందించింది. 40కి 40 స్థానాలు గెలుపొందాలని లక్ష్యంగా నిర్దేశించుకుని పనిచేస్తోంది. జనవరి 13న ఈ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అక్కడ ఓ భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు మరికొన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొచ్చేలా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. మొత్తంగా మహాగట్భంధన్‌గా ఏర్పడ్డ జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల కూటమిని ఓడించేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తుంది. ఈ మధ్య జేడీ(యూ), ఆర్జేడీ మధ్య నెలకొన్న స్పర్థలను కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది.

ఈ రెండు రాష్ట్రాలతో పాటు బిహార్‌కు ఆనుకునే ఉన్న పశ్చిమ బెంగాల్ కూడా బీజేపీకి ప్రతికూలంగానే ఉంది. అక్కడ విపక్ష కూటమిలో భాగంగా మమత బెనర్జీకి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా జతవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ వ్యతిరేక మైనారిటీ ఓటుబ్యాంకు గణనీయమైన సంఖ్యలో ఉంది. గతంలో బీజేపీ ఇక్కడ ఒంటరిగానే 42 సీట్లలో పోటీ చేసి 18 గెలుచుకోగలిగింది. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సైతం 42 సీట్లలో పోటీ చేసి 22 గెలుచుకుంది. కాంగ్రెస్ 40 చోట్ల పోటీ చేసి 2 మాత్రమే గెలుచోగా.. వామపక్ష పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. ఈసారి ఇక్కడ విపక్షాల పొత్తు సమీకరణాలు ఫలిస్తే బీజేపీకి సంఖ్యాబలం తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా గెలిచిన సీట్లు 58 ఉన్నాయి. ఈసారి ప్రతికూలతల నడుమ అన్ని స్థానాలు గెలుపొందలేకపోతే 2019 నాటి స్కోర్ సాధించే అవకాశం కూడా ఉండదు. అలాగని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో బీజేపీతో కలిసి నడుస్తున్న పార్టీల్లో పెద్ద సంఖ్యలో సీట్లను గెలుపొందే పెద్ద పార్టీ కూడా ఏదీ కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ దాటాల్సి ఉంటుంది. అందుకే కమలనాథులు తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించి, ఈ ఎన్నికలు తమ జీవన్మరణ సమస్యగా భావించి పోరాడేందుకు పావులు కదుపుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..