నినాధాలు కాదు.. నిశబ్ధ సేవే.. నిజమైన దేశ భక్తకి నిదర్శనం..

మనకు దేశభక్తి అనగానే సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులు గుర్తొస్తారు. నిజానికి వారి త్యాగాలు వెలకట్టలేనివి. కానీ, ఉదయం లేచినప్పటి నుంచి, రోజంతా కష్టపడి రాత్రికి అలసిపోయి పడుకునే వరకు ఓ సామాన్యుడు కూడా తనకు తెలియకుండానే దేశసేవలో తన వంతు కీలక పాత్రను పోషిస్తున్నాడనే దాన్ని మాత్రం మనం ఎప్పుడూ గమనించి ఉండం. కాబట్టి దేశ సేవలో ఒక సమాన్యుడి పాత్ర ఎంత కీలకమో ఇప్పుడు తెలుసుకుందాం.

నినాధాలు కాదు.. నిశబ్ధ సేవే.. నిజమైన దేశ భక్తకి నిదర్శనం..
What Is Real Patriotism

Edited By:

Updated on: Oct 11, 2026 | 11:22 AM

ఒకసారి ఓ మనవడు తన తాతను, నేను దేశసేవ చేయాలంటే ఏం చేయాలి? అని అడిగాడు. తాత నవ్వి, ముందు వెళ్లి నాకు ఒక గ్లాసు నీళ్లు తీసుకురా అన్నాడు. పిల్లాడు నీళ్లు తెచ్చివ్వగానే, నువ్వు ఇప్పుడు ఏం చేశావు? అని తాత అడిగాడు. మీకు దాహమేస్తే నీళ్లు తెచ్చాను అన్నాడు పిల్లాడు. మంచి పని చేశావా? అంటే పిల్లాడు అవునన్నాడు. అయితే నువ్వు దేశసేవ చేయడం మొదలుపెట్టావు అని తాత చెప్పాడు. దేశం అంటే కేవలం మ్యాప్‌లో ఉండే సరిహద్దులు, నదులు, కొండలు మాత్రమే కాదు.. ఆ దేశంలో నివసించే కోట్లాది మంది ప్రజలు. తోటి మనిషి కష్టాన్ని గుర్తించి ఆదుకోవడమే దేశభక్తికి తొలి అడుగని ఆ తాతా మనవడికి వివరించారు.

అజ్ఞాత దేశభక్తులు

మనం రోజూ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెచ్చుకుంటాం. కానీ ఆ కూరగాయల వెనుక ఎందరో శ్రమ దాగుంది. తెల్లవారుజామునే లేచి పొలాన్ని తడిపిన రైతు, కలుపుతీసిన కూలీ, రాత్రంతా వాహనాన్ని నడిపిన డ్రైవర్, మార్కెట్లో అమ్మిన వ్యాపారి.. వీరిలో ఎవరి పేరూ మనకు తెలియదు. వారు దేశాన్ని ఉద్ధరిస్తున్నామని బయలుదేరలేదు, కేవలం తమ కుటుంబాన్ని పోషించుకోవడానికే పనిచేశారు. కానీ వారి శ్రమ ఫలితంగానే మన కంచంలోకి ఆహారం వస్తోంది. అలాగే రోడ్లను ఊడ్చే పారిశుధ్య కార్మికుడు, ఆసుపత్రిలో రోగి బెడ్‌షీట్ మార్చే సహాయకుడు, పిల్లలను సురక్షితంగా చేర్చే బస్సు డ్రైవర్, అంబులెన్స్‌ను రిపేర్ చేసే మెకానిక్, రోడ్డు దాటించే బాటసారుడు.. వీరిలో ఎవరికీ మెడల్స్ రావు, ప్రశంసలు దక్కవు. కానీ వీరంతా ఒక్కరోజు పని ఆపేస్తే సమాజం స్తంభించిపోతుంది. మన జీవితాలు మనం గుర్తించని ఎంతోమంది శ్రమపై ఆధారపడి ఉన్నాయనేది కూడా కాదనలేని వస్తవం.

నినాదాలు కాదు.. నిజాయితీ ముఖ్యం!

కొందరు నిత్యం దేశభక్తి గురించి గొప్పగా మాట్లాడతారు, జెండాలు పడతారు. కానీ కార్మికులకు సరిగ్గా వేతనాలు ఇవ్వరు, తోటివారిని మోసం చేస్తారు. ఇంకొందరు దేశభక్తి గురించి అస్సలు మాట్లాడరు.. కానీ తమ పనులను నిజాయితీగా చేస్తారు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతారు, కల్తీ చేయరు, సరైన తూకం వేస్తారు, సమయానికి పన్నులు చెల్లిస్తారు. మరీ వీరిద్దరిలో నిజమైన దేశభక్తుడు ఎవరు? బడిని నిర్మించేటప్పుడు నాణ్యమైన పదార్థాలు వాడే కార్మికుడు, పేదవాడిని ధనికుడితో సమానంగా చూసే అధికారి, బిడ్డకు అబద్ధం చెప్పకూడదని నేర్పే తల్లి.. వీరంతా నిజమైన దేశ నిర్మాతలు. పదవులు, ఆర్భాటాల కంటే ప్రవర్తనలోని నిజాయితీయే దేశభక్తికి గీటురాయి అని నిరూపించేవారు.

సహనం, గౌరవమే అసలైన బలం

మన రాజ్యాంగం భారతదేశ ప్రజలమైన మేము అనే పదాలతో మొదలవుతుంది. అంటే దేశం అందరిదీ. భాష, మతం, అభిప్రాయాలు వేరైనా తోటి పౌరుడి హక్కులను, గౌరవాన్ని గుర్తించగలగడమే నిజమైన ప్రజాస్వామిక దేశభక్తి. రోజూ పడుకునే ముందు ఎంత సంపాదించామని కాకుండా, మన చర్యల వల్ల సమాజానికి లేదా ఒక్క మనిషికైనా మేలు జరిగిందా అని ఆలోచిస్తే.. ఆ నిశ్శబ్ద సేవ కూడా దేశానికి చేసిన గొప్ప సహాయమే అవుతుంది. దేశాన్ని ప్రేమించడమంటే తోటి మనిషిని ప్రేమించడమే!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us