Trending: రోడ్డు మార్గం, రైలు మార్గం, వాయు మార్గం, నీటి మార్గం.. ఏ రూట్‌ను విడిచిపెట్టడం లేదు కేటుగాళ్లు. ఈజీ మనీకి అలవాటుకు పడి.. మత్తు పదార్థాలతో సొమ్ము చేసుకుంటున్నారు. తనిఖీలు తప్పించుకునేందుకు ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ.. పోలీసులకు సవాల్ విసరుతున్నారు. తాజాగా తమిళనాడు(Tamil Nadu)లో గంజాయి స్మగర్లకు సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసింది. ఇటీవల రామేశ్వరం(Rameswaram) సమీపంలో సముద్రంలో తేలియాడుతూ.. ఓ బ్యాగ్ కనిపించింది. దీంతో పెట్రోలింగ్ చేస్తున్న కోస్ట్‌గార్డ్ అనుమానం వచ్చి ఆ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. దాన్ని విప్పి చూడగా.. లోపల A క్వాలిటీ గంజాయి కనిపించింది. బ్యాగ్‌లో ఒక్కొక్కటి 3 కిలోల బరువున్న 20 పాకెట్ల గంజాయి ఉన్నాయి. హోవర్‌క్రాఫ్ట్ మన్నార్ గల్ఫ్‌లో రెగ్యులర్ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఈ బ్యాగ్‌ని గుర్తించినట్లు కోస్ట్ గార్డ్ సిబ్బంది తెలిపారు. అనంతరం ఆ గంజాయిని స్థానిక కస్టమ్స్ సూపరింటెండెంట్‌కు అప్పగించారు. ఈ బ్యాగ్ శ్రీలంకకు అక్రమంగా తరలించిన పెద్ద సరుకులో భాగమని ప్రాథమిక విచారణలో తేలింది. బోటు నుంచి అనుకోకుండా ఈ పార్శిల్ సముద్రంలో పడి ఉండిచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇకపై సముద్ర తీరాల్లో కూడా గస్తీ పెంచేందుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం..