NEET: నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.. అన్నాడీఎంకే పూర్తి మద్దతు

|

Sep 13, 2021 | 8:10 PM

తమిళనాడు అసెంబ్లీ నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. తమిళనాడు విద్యార్ధులకు నీట్‌ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు

NEET: నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.. అన్నాడీఎంకే పూర్తి మద్దతు
Cm Stalin
Follow us on

NEET – Tamil Nadu – Assembly: తమిళనాడు అసెంబ్లీ నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. తమిళనాడు విద్యార్ధులకు నీట్‌ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు అసెంబ్లీ ముక్తకంఠంతో కేంద్రానికి చాటింది. తమ రాష్ట్రంలో నీట్‌ పరీక్షను రద్దు చేస్తామని ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్‌. అన్నాడీఎంకే కూడా నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపింది. తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి స్టాలిన్‌. బీజేపీకి అన్నాడీఎంకే మిత్రపక్షమని, నీట్‌ను రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. అదే సమయంలో నీట్ లేకుండా మెడికల్ అడ్మిషన్ల కోసం తెచ్చిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది.

సీఏఏ, సాగుచట్టాలపై ఓటింగ్‌ జరిగినప్పుడు నీట్‌ను రద్దు చేయాలన్న షరతును పెట్టి ఉంటే కేంద్రం ఆనాడే నిర్ణయం మార్చుకునేదని అన్నాడీఎంకే నేతలకు స్టాలిన్‌ చురకలంటించారు. నీట్‌ పరీక్ష ఒత్తిడిని తట్టుకోలేక తమిళనాడు విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే అన్నాడీఎంకే నేతలు ఇన్నాళ్లు ప్రేక్షకపాత్ర పోషించారని మండిపడ్డారు. బీజేపీని ఎదిరించే ధైర్యం బీజేపీ నేతలకు లేదన్నారు. తాము అధికారం లోకి వచ్చాక నీట్‌ పరీక్షను రద్దు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటునట్టు సీఎం సభకు తెలిపారు.

12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడిసిన్‌లో విద్యార్ధులకు ప్రవేశం ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి స్టాలిన్‌. నీట్‌కు తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. తమిళనాడు విద్యార్ధులకు నీట్‌ పరీక్ష అవసరం లేదన్నారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కే విధంగా నీట్‌ పరీక్ష విధానాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. పేద, దళిత విద్యార్ధులకు దీంతో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు స్టాలిన్‌. అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్నాడీఎంకేతో సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది.

Read also: Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు