
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని వీధుల్లోని వీధి కుక్కలన్నింటినీ తొలగించి డాగ్ షెల్టర్ హోమ్‌లకు పంపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుతో దేశవ్యాప్తంగా జంతుప్రేమికులు భగ్గుమంటున్నారు. కోర్టు ఉత్తర్వు తర్వాత ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా మంది నిరసన వ్యక్తం చేయగా, కొందరు దీనిని సమర్థించారు. ప్రస్తుతం దేశంలో ఇదే చర్చ కొనసాగుతోంది. అయితే ఇంతలో ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్ జిల్లా నుండి ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. వీధి కుక్క నాకడం వల్ల రెండేళ్ల బాలుడు దారుణంగా మరణించాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
ఇప్పటివరకు మీరు కుక్క కాటు మరణాల గురించి వినే ఉంటారు. కానీ, బుడాన్ లోని సహస్వాన్ ప్రాంతంలో ఒక వీధి కుక్క నాకడంతో రెండేళ్ల బాలుడు మరణించాడు. సమాచారం ప్రకారం, ఒక నెల క్రితం ఒక వీధి కుక్క 2 ఏళ్ల అద్నాన్ కాలికి అయిన గాయాన్ని నాకింది. ఆ బాలుడి మరణానికి ఇదే కారణం. అవును బాలుడి గాయాన్ని వీధి కుక్కటం వల్ల అతడు రేబిస్ వ్యాధి బారినపడ్డాడు. ఆగస్టు 18న అతడు రేబిస్‌తో మరణించాడు.
బాలుడి మరణంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. నెల రోజుల క్రితం మొహమ్మద్ అద్నాన్ కాలు మీద ఉన్న గాయాన్ని కుక్క నాకింది. దాంతో అతడికి రేబిస్ సోకింది. కొద్ది రోజుల్లోనే పిల్లవాడిలో లక్షణాలు కనిపించాయి. అతడు నీళ్లంటే భయపడిపోయేవాడు. నీళ్లు తాగడానికి కూడా భయపడ్డాడు. దీనినే హైడ్రోఫోబియా అంటారు. అతని పరిస్థితి విషమించటంతో బాలుడిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఆ పిల్లవాడు మరుసటి రోజు మరణించాడు. వీధి కుక్క బాలుడి గాయాన్ని నాకిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ సంఘటన జరగడంతో స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించింది. దీంతో భయపడిన 30 మంది స్థానికులు ముందస్తుగానే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిసింది.
ఆ సంఘటన చూసి వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఈ సంఘటనపై బదౌన్ జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత్ త్యాగి మాట్లాడుతూ, కుక్క కాటు లేదా నాకడాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదని ఈ సంఘటన నిరూపిస్తుందని చెప్పారు. ఎలాగైనా సరే రేబిస్ వచ్చే ప్రమాదం ఉందన్నారు.. కుక్కలకే కాదు, పిల్లి లేదా కోతి కరిచినా లేదా నాకినట్లయితే వెంటనే రేబిస్ టీకా తీసుకోవాలని సూచించారు. ఇలాంటి విషయాల్లో ప్రజలు అశ్రద్ధగా ఉండరాదని డాక్టర్ హెచ్చరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..