డౌ హిల్ అడవుల్లో అరుదైన అద్భుతం.. పర్యాటకుడి కెమెరాకు చిక్కిన అరుదైన వన్యప్రాణి

అడవిలో మరోసారి కనిపించిన ఆ వింత జీవి పర్యాటకులను ఆశ్చర్యపరిచింది. ఒకే ప్రాంతంలో పదేపదే దాని జాడలు బయటపడటంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి? అటవీ శాఖ ఉన్నతాధికారులు ఏమంటున్నారు..? ఈ కథనంలో తెలుసుకుందాం ... ..

డౌ హిల్ అడవుల్లో అరుదైన అద్భుతం.. పర్యాటకుడి కెమెరాకు చిక్కిన అరుదైన వన్యప్రాణి
Black Deer

Updated on: Oct 19, 2026 | 4:13 PM

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, కుర్సియోంగ్‌ ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. దసరా పండగ సీజన్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వస్తున్న సందర్శకులకు ఓ అరుదైన దృశ్యం కనువిందు చేసింది. కుర్సియోంగ్‌ అటవీ విభాగం పరిధిలోని డౌ హిల్‌ అడవుల్లో మరోసారి నల్ల జింక కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులు, వన్యప్రాణి ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. పైన్‌ చెట్లతో నిండిన డౌ హిల్‌ అడవుల్లో ఓ పర్యాటక బృందం ట్రెక్కింగ్‌ చేస్తుండగా.. వారిలో ఒకరికి పూర్తిగా నల్లని రంగులో ఉన్న జింక కనిపించింది. వెంటనే అప్రమత్తమైన ఆ పర్యాటకుడు దానిని తన కెమెరాలో బంధించాడు. అత్యంత అరుదుగా కనిపించే ఈ వన్యప్రాణిని ప్రత్యక్షంగా చూడటంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కుర్సియోంగ్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ దేబేశ్‌ పాండే కూడా డౌ హిల్‌ అడవుల్లో ఇలాంటి జింకను గుర్తించి ఫొటోలు తీశారు. తాజాగా మరోసారి అదే ప్రాంతంలో నల్ల జింక కనిపించడంతో ఈ అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల ఉనికిపై చర్చ మొదలైంది.

జింక నల్లగా ఎందుకు మారుతుంది?

జంతువుల శరీరంలో మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల వాటి చర్మం లేదా శరీరంపై ఉండే రంగులో మార్పులు వస్తాయి. ఈ లక్షణాన్ని మెలానిజం అంటారు. జన్యుపరమైన మార్పుల కారణంగా కొన్ని జంతువులు సాధారణ రంగుకు భిన్నంగా పూర్తిగా నల్లగా కనిపిస్తాయి. నల్ల చిరుతపులుల్లో కనిపించే ఈ లక్షణం కొన్ని జింకల్లోనూ కనిపించవచ్చు. డౌ హిల్‌ అడవుల్లో కనిపించిన జింకలు బార్కింగ్‌ డీర్‌ జాతికి చెందినవిగా గుర్తించారు. అయితే ఈ జింకల్లో మెలానిజానికి సంబంధించిన నిర్ధారణకు శాస్త్రీయ పరిశీలన అవసరం.

అటవీ శాఖకు ఆనందం.. మరోవైపు ఆందోళన

ఒకే ప్రాంతంలో పదేపదే నల్ల జింకలు కనిపించడం పట్ల కుర్సియోంగ్‌ డీఎఫ్‌ఓ దేబేశ్‌ పాండే సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో అరుదైన నల్ల చిరుతలు కూడా గతంలో కనిపించాయని, ఇప్పుడు నల్ల జింకల జాడలు వెలుగులోకి రావడం విశేషమని పేర్కొన్నారు. అయితే ఇలాంటి అరుదైన వన్యప్రాణులు వేటగాళ్లకు లక్ష్యంగా మారే ప్రమాదం ఉండటంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. జంతువుల రక్షణకు ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేసి, డౌ హిల్‌తో పాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు సమాచారం.

మొత్తానికి.. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అరుదైన జీవవైవిధ్యానికి డౌ హిల్‌ అడవులు మరోసారి వేదికయ్యాయి. నల్ల జింకల వరుస దర్శనాలు వన్యప్రాణి ప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతుండగా.. వాటి సంరక్షణ ఇప్పుడు అటవీ శాఖకు కీలకంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us