2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ దేశ రాజకీయాల్లో తన పట్టును నిలుపుకోవాలని భావిస్తుండగా, కమలం పార్టీని కూలదోసి పునఃవైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈక్రమంలో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. కాగా బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో సహా పలు ప్రాంతీయ పార్టీలు థర్డ్ ఫ్రంట్, మహాకూటమి వంటి ప్రతిపాదనలను తెరమీదకు తీసుకొచ్చారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు ఈ థర్డ్‌ఫ్రంట్‌లో భాగం కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈక్రమంలో మరికొందరు కలిసివస్తే ఈ కూటమి బలోపేతమవుతుందన్న తరుణంలో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీల ప్రతిపాదిత మహాకూటమిలో తాము భాగం కాబోమని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని, 100 కోట్ల మంది భారతీయ ఓటర్లతో మాత్రమే పొత్తు ఉంటుందని ఆప్ అధినేత స్పష్టం చేశారు.
దేశం గెలవాలని కోరుకుంటున్నా!
“నాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు. ఒకరిని ఓడించడానికి 10 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడంలో అర్థం లేదు. నేను ఎవరినీ ఓడించాలని కోరుకోవడం లేదు. దేశం గెలవాలని కోరుకుంటున్నాను’ అని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహా కూటమిని ఏర్పాటుచేయాలనుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. కాగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమి ప్రతిపాదనలను తెరమీదకు తీసుకొచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీ హవానే సాగింది. దీంతో ఈ మహాకూటమి ఆశలు నీరుగారాయి. ఈక్రమంలో ఏప్రిల్29న ఢిల్లీలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిలో సమావేశమయ్యారు కేజ్రీవాల్. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసమే ఈ సమావేశం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో AAP, TMC పార్టీల మధ్య దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దుకునే లక్ష్యంతోనే ఈ సమావేశం జరిగినట్లు తరువాత తెలిసింది. పంజాబ్‌లో ఆప్ పార్టీ విజయం సాధించినందుకు కేజ్రీవాల్‌ను అభినందించేందుకే మమతా బెనర్జీ వచ్చారని ఇరు పార్టీలు ప్రకటించాయి. కాగా క్షీణిస్తున్న కాంగ్రెస్‌ను దీటుగా జాతీయ నాయకుడిగా ఎదగాలనే ఉమ్మడి ఆశయంతోనే ఈ ఇద్దరు నేతలూ తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో వారు కాంగ్రెస్ మరింత దిగజారిపోయే వరకు వేచి ఉండటానికే ఇష్టపడతారు. తద్వారా తమ పార్టీలే బీజేపీకి సరైన ప్రత్యా్మ్నాయంగా ఎదగవచ్చని ఈ ఇద్దరు నేతలు భావిస్తున్నారు.
అందుకే వెనకడుగు..
డీఎంకే వంటి కొన్ని మినహాయింపులను మినహాయిస్తే.. చాలా ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడేంతగా కాంగ్రెస్‌ను ఇష్టపడవు. తమకు ప్రత్యక్షంగా వాటా ఉంటే తప్ప, నిరభ్యంతరంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వారికి ఇష్టం ఉండదు. ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాల్లోని అధికార పార్టీలను దెబ్బతీయాలనే సంకల్పం, సామర్థ్యం రెండూ మోదీ ప్రభుత్వానికి ఉన్నాయన్న వాస్తవాన్ని వారు తీవ్రంగా గ్రహించారు. CBI, ED మరియు ఆదాయపు పన్ను వంటి కేంద్ర ఏజెన్సీలను ప్రతిపక్ష నాయకులపై విప్పేటటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా రాష్ట్రాలకు ప్రవహించే అనేక ప్రభుత్వ నిధులను నిలిపివేయడానికి కేంద్రానికి అపారమైన అధికారాలు ఉన్నాయి. కాగా ప్రాంతీయ పార్టీలకు ఎన్నికలలో నేరుగా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయనంత వరకు ఇటువంటి దాడులను నివారించవచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటిలోనూ కాంగ్రెస్సే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. అయితే కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా, ఈ ఎన్నికలలో వరుస పరాజయాల రికార్డును కొనసాగిస్తే మాత్రం మహా కూటమి ఆశలకు గండిపడినట్లే..
కాంగ్రెస్ స్థానంలోకి రావాలనే తలంపుతోనే..
కాగా ప్రతిపక్షాల ప్రతిపాదిత మహాకూటమిలో AAP భాగం కాదని కేజ్రీవాల్ ఆదివారం నాగ్‌పూర్‌లో చేసిన ప్రకటన అతని భవిష్యత్ విస్తృత ప్రణాళికలకు అనుగుణంగానే ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ప్రతిపాదిత మహాకూటమిలోకి AAPని చేర్చుకోవాలని ఆశించిన వారికి ఇది ఒక పెద్ద కుదుపుగా అనిపించవచ్చు. ఒకవేళ మహాకూటమిలో భాగం కావడానికి AAP అధినేత అంగీకరించి ఉంటే ఇప్పటికే అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌లో కొన్ని ప్రతిపక్ష పార్టీలతో సీట్లు పంచుకోవాలి. అదేవిధంగా రాహుల్ గాంధీని నాయకుడిగా అంగీకరించాల్సి ఉంది. ఇది ఆప్ అధినేతకు ఏ మాత్రం ఇష్టంలేదు. కాగా బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని తమ సంప్రదాయ ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయింది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు మొదట ఢిల్లీలో, మొన్న పంజాబ్‌లో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దింపి ఆప్ మరింత బలంగా తయారైంది. అయితే కేజ్రీవాల్ కారణంగా ఏ రాష్ట్రంలోనూ బీజేపీ తమ అధికారాన్ని కోల్పోలేదు. పైగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ చేతిలో వారణాసిలో కేజ్రీవాల్ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుసగా రెండుసార్లు ఘోర పరాభవాన్ని చవిచూసింది కేజ్రీవాల్ పార్టీ.
అక్కడ ఆప్ రికార్డు పేలవం..
కాగా బీజేపీ అధికారంలో ఉన్న చోటల్లా AAP రికార్డు చాలా పేలవంగా ఉంది. ఈక్రమంలో కమలం పార్టీకంటే క్షీణ దశలో ఉన్న కాంగ్రెస్ స్థానంలోకి రావడమే సులభమని భావిస్తున్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించాలని ఢిల్లీ సీఎం అనుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఒక వ్యక్తి (మోదీ)ని ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలు ఎందుకు ఏకం కావాలో అర్థం చేసుకోవడంలో తాను విఫలమయ్యానని కేజ్రీవాల్ చేసిన ప్రకటన సహేతుకంగానూ ఉంది. కాగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పాలిత గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఆప్ పోటీ చేసింది. గోవాలో గెలుపొందిన రెండు సీట్లు మినహాయిస్తే, మిగిలిన రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆప్ ఘోరంగా విఫలమైంది. అయితే ఏ మాత్రం అధైర్యపడకుండా ఈ ఏడాది చివర్లో మరో రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది ఆప్.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: