
సైప్రస్‌లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రెసిడెంట్ సతీమణి, ఫస్ట్ లేడీ ఫిలిప్పా కార్సెరాకు సిల్వర్ క్లచ్ పర్స్ బహుకరించారు. ఇది ఏపీలో తయారు చేసింది కావడం విశేషం. భారతదేశ గొప్ప హస్తకళను ప్రతిబింబించేలా.. దీన్ని భారత సంప్రదాయ కళతో మోడర్న్ స్టైల్ ఉట్టిపడేలా రూపొందించారు. టెంపుల్, రాయర్ ఆర్ట్‌ను ప్రతిబింబించారు. మధ్యలో అమర్చిన విలువైన రాయి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. మరోవైపు ప్రెసిడెంట్ నికోస్‌కు కశ్మీర్ సిల్క్ కార్పెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఎరుపు రంగు కార్పెట్ సాంప్రదాయ వైన్, రేఖాగణిత నమూనాలను కలిగి ఉంది. ఇది విలువైన రెండు-టోన్ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. వీక్షణ కోణం, లైటింగ్ ఆధారంగా రంగులు మారుతున్నట్లు కనిపిస్తుంది. ఒకదానిలో రెండు వేర్వేరు కార్పెట్‌లు ఉన్నాయనే భ్రమను కలిగిస్తుంది.
రెండు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని సైప్రస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్బంగా భారత ప్రధాని మోదీ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ను ప్రదానం చేశారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతకు ముందు సైప్రస్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి అత్యంత ఉత్సాహంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ ఘన స్వాగతానికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. సైప్రస్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..