
కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. సంప్రదాయం, సాంకేతికత కలిసిన అద్భుత దృశ్యానికి వేదికగా నిలిచిన దసరా డ్రోన్ షో మరో గిన్నిస్ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వేలాది డ్రోన్‌లతో రాత్రి ఆకాశంలో భారత జాతీయ పక్షి నెమలిని భారీ రూపంలో ఆవిష్కరించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
అక్టోబర్ 18న మైసూరులోని బన్నిమంటప్ టార్చ్‌లైట్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ అద్భుత ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 3,473 డ్రోన్‌లు సమన్వయంతో కదులుతూ ఆకాశంలో నాట్యమాడుతున్న నెమలి రూపాన్ని సృష్టించాయి. నెమలి ఈకలు విప్పి నాట్యం చేస్తున్నట్లుగా కనిపించిన ఈ దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. డ్రోన్‌లతో రూపొందించిన పక్షి యొక్క అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా ఈ విన్యాసం గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఆకాశంలో అద్భుత విన్యాసాలు
ఐఐటీ ఢిల్లీ ఇంక్యుబేటెడ్ కంపెనీ అయిన బాట్‌ల్యాబ్ డైనమిక్స్ ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. మైసూరు దసరా వేడుకల్లో భాగంగా చాముండేశ్వరి ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ (CESC) ఈ డ్రోన్ షోను నిర్వహించింది. నెమలితో పాటు సీతాకోకచిలుక, సింహం, చక్రం, శ్రీకృష్ణుడి రూపం వంటి పలు ఆకృతులను కూడా డ్రోన్‌లతో ఆవిష్కరించారు.
కర్ణాటకకు గర్వకారణం
ఈ ఘనతపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ వేడుకలు ఆధునిక సాంకేతికతను ఎంత అందంగా స్వీకరించగలవో మైసూరు దసరా ప్రపంచానికి చాటుతోందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన కర్ణాటక సంస్కృతి, సృజనాత్మకత, ప్రగతికి ప్రతీకగా నిలిచిందని అభివర్ణించారు.
సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
డ్రోన్ షో వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వేలాది డ్రోన్‌లు కలిసి ఇంత భారీ నెమలి రూపాన్ని సృష్టించడం అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ విజయంతో మైసూరు దసరా ఉత్సవాలకు అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. భారతీయ సంప్రదాయ వైభవానికి ఆధునిక సాంకేతికత తోడైతే ఎంత అద్భుతమైన దృశ్యాలను సృష్టించవచ్చో ఈ డ్రోన్ షో మరోసారి నిరూపించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..