జీవితాంతం కష్టపడినా ఇంత సంపాదించరు.. ఓ కానిస్టేబుల్ సంపాదన అక్షరాల రూ.64 కోట్లు..

మధ్యప్రదేశ్‌లో హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్‌కు సంబంధించిన 46 స్థిరాస్తుల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తుల విలువ రూ.17.19 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.64 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.. అవినీతి ఆరోపణలపై ఇండోర్ లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. ఫిరోజ్ ఖాన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

జీవితాంతం కష్టపడినా ఇంత సంపాదించరు.. ఓ కానిస్టేబుల్ సంపాదన అక్షరాల రూ.64 కోట్లు..
Mp Head Constable Assets

Updated on: Oct 22, 2026 | 9:11 AM

మధ్యప్రదేశ్ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి దగ్గర కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడటం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇండోర్ లోకాయుక్త జరిపిన విచారణలో, హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్ అతని సహచరుల పేర్లపై 46 స్థిరాస్తులు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ సుమారు 17కోట్ల 19లక్షలుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్ వాల్యూ రూ.64 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంతేకాకుండా, 21కి పైగా బ్యాంకు ఖాతాలు, ప్రైవేట్ కంపెనీలు, భూ లావాదేవీలు కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఒక సాధారణ పోలీసు అధికారి ఇంత భారీ సంపదను ఎలా కూడగట్టగలిగారనేదానిపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.

ఇండోర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్, సుదీర్ఘకాలం పాటు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం, భూ లావాదేవీల కోసం తన పదవిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా, లోకాయుక్త పోలీసులు ఫిరోజ్ ఖాన్ అతని సహచరురాలు రోష్నీ వర్మపై ‘అవినీతి నిరోధక చట్టం’ కింద కేసు నమోదు చేశారు. లోకాయుక్త బృందం ఇండోర్, దేవాస్‌లలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

ఈ విచారణ కేవలం ఇళ్లు, ప్లాట్లకే పరిమితం కాలేదు. ఫిరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన కంపెనీల పేర్లతో కొనుగోలు చేసిన భూములు కూడా ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం, ఫిరోజ్ ఖాన్ భార్య హీనా, యువరాజ్ పన్వార్‌లకు సంబంధం ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ, ఇండోర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

ఇటీవల ఫిరోజ్ ఖాన్ కుమార్తె వివాహానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వేడుకలో కరెన్సీ నోట్ల కట్టలను వెదజల్లారని ఆరోపణలు వస్తున్నాయి. లోకాయుక్త రాసిన లేఖతో పోలీస్ ట్రైనింగ్ కాలేజీ అధికారులు ఫిరోజ్ ఖాన్‌ను సస్పెండ్ చేశారు. ఒక కానిస్టేబుల్ దగ్గరే ఇంత ఆస్తి ఉంటే, ఇక ఉన్నతాధికారులు, మంత్రుల దగ్గర ఎంత ఉంటుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us