BS Yediyurappa: యడీయూరప్పను తప్పిస్తే తీవ్ర పరిణామాలు.. బీజేపీ అధిష్టానానికి లింగాయత్ నేతల అల్టిమేటం..!

కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీలో అనిశ్చితి కొనసాగుతోంది. నాయకత్వ మార్పుపై కన్నడ నాట జోరుగా చర్చ జరుగుతోంది.

BS Yediyurappa: యడీయూరప్పను తప్పిస్తే తీవ్ర పరిణామాలు.. బీజేపీ అధిష్టానానికి లింగాయత్ నేతల అల్టిమేటం..!
Lingayat Seers Extend Support To Yediyurappa
Balaraju Goud

| Edited By: Janardhan Veluru

Jul 21, 2021 | 10:22 AM

Lingayat seers extend support to yediyurappa: కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీలో అనిశ్చితి కొనసాగుతోంది. నాయకత్వ మార్పుపై కన్నడ నాట జోరుగా చర్చ జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప త్వరలో రాజీనామా చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. యడియూరప్ప నాయకత్వాన్ని సొంత పార్టీ నేతలే కొందరు బేఖాతరు చేయడం లేదు. ముఖ్యమంత్రిగా యడియూరప్ప దిగిపోవాలన్న డిమాండ్ తీవ్రంగా వినిపిస్తోంది. ఈ మేరకు యడ్డీని వ్యతిరేకిస్తున్న కొందరు కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. నాయకత్వ మార్పు జరిగి తీరాలని కోరుతూ పలుమార్లు వినతిపత్రాలు కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో.. సీఎం యడియూరప్ప మంత్రులతో అర్ధరాత్రి వరకూ చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ చర్చల్లో ప్రధానంగా ఏఏ అంశాలపై చర్చ జరిగిందన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. నాయకత్వ మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగిందని.. మంత్రుల్లో మెజార్టీ మంత్రులు యడ్డీకే మద్దతు తెలిపినట్లు సమాచారం.

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి రెండేళ్లయింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన యడియూరప్ప.. అప్పటి నుంచి ఇంటి పోరుతో సతమతమవుతూనే ఉన్నారు. ఆయనను వ్యతిరేకిస్తూ కొందరు మీడియా ముందుకెళ్లి వ్యాఖ్యలు చేస్తే.. మరికొందరైతే ఏకంగా కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. యడియూరప్ప వయసు ప్రస్తుతం 75 సంవత్సరాలు. బీజేపీ అధిష్ఠానం 75 ఏళ్ల వయసు దాటిని వారికి నాయకత్వ పగ్గాలు అప్పగించిన సందర్భాలు అరుదు. ఈ అంశాన్ని కూడా సాకుగా చూపి యడియూరప్ప వ్యతిరేక వర్గం ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరింది. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు, ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం పార్టీకి అంత శ్రేయస్కరం కాదనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. యడియూరప్ప సొంత పార్టీ నేతల అసమ్మతిని భరించలేక ఆయనే స్వయంగా రాజీనామాకు సిద్ధపడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. తన సొంత నియోజకవర్గంలో చివరిసారిగా సీఎం హోదాలో పర్యటించాలని ఆయన భావిస్తున్నారని.. అందుకే జులై 23, 24న శివమొగ్గ నియోజకవర్గంలో యడియూరప్ప పర్యటించబోతున్నారనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ నేపథ్యంలోనే.. సీఎం యడియూరప్ప జూలై 25న బీజేపీ ఎమ్మెల్యేలు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో చివరిసారిగా సమావేశమై వారందరికీ విందు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అనంతరం.. జూలై 26న ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.

ఇదిలావుంటే, నాయకత్వ మార్పు గురించి ఊహాగానాల మధ్య, ముఖ్యమంత్రి యడియరప్పకు లింగాయత్ వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అండగా నిలిచారు. రాష్ట్రంలోని వివిధ మఠాల నుండి వచ్చిన నేతులు సైతం మద్దతు లభిస్తోంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఎంబీ పాటిల్ స్పందిస్తూ.. బీజేపీ సీనియర్ నేత, బలమైన నాయకుడు అయిన యడియరప్పను ముఖ్యమంత్రిగా తొలగిస్తే లింగాయత్ సంఘం అసంతృప్తికి గురిచేస్తుందని అన్నారు. ఆయన వయసు, అనుభవం దృష్టిలో ఉంచుకుని కొనసాగించాలన్నారు. ఆయన అవసరం రాష్ట్రానికి ఉందన్నారు. యడియరప్పను కొనసాగించాలని బిజెపి హైకమాండ్‌ను దావంగెరే (దక్షిణ) కాంగ్రెస్ ఎమ్మెల్యే షమనూర్ శివశంకరప్ప కోరారు. అఖిల భారత వీరశైవ మహాసభ జాతీయ అధ్యక్షుడు శివశంకరప్ప బిజెపిని బలవంతంగా పదవీవిరమణ చేస్తే యడియరప్పకు సంఘీభావం తెలుపుతామని హెచ్చరించారు.

మంగళవారం, వివిధ మఠాల నుండి వచ్చిన ప్రతినిధుల బృందం యడియరప్పను తన అధికారిక నివాసంలో కలిసింది. చిత్రదుర్గకు చెందిన శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర మఠం అధిపతి శివమూర్తి మురుగ శరణారు మంగళవారం ఒక ప్రకటనలో యడియరప్ప తొలగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి ఉంటుందని బీజేపీని హెచ్చరించింది.”రాష్ట్రం చూసిన గొప్ప రాజనీతిజ్ఞులు – రాజకీయ నాయకులలో యడియురప్ప ఒకరు. యడియరప్ప కారణంగా బీజేపీ దక్షిణ భారతదేశంలో ఎన్నికలలో విజయం సాధించగలిగింది. కర్ణాటకలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది”అని మురుగ శరణారు తెలిపారు. కర్ణాటక ఆరు కోట్ల జనాభాలో దాదాపు 17 శాతం ఉన్న లింగాయత్‌లు ఆధిపత్యంగా ఉన్నారు. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90-100 వరకు ఎన్నికల ఫలితాలను ఈ వర్గం శాసించే స్థాయిలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ చిత్తశుద్ధితో వ్యవహరించడం వల్ల 1990 వ దశకంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోయిన తరువాత బీజేపీ నాయకుడు యడియరప్పకు మద్దతు ఇచ్చింది. ముఖ్యమంత్రి స్థానం అశిస్తున్న వారిలో ఎమ్మెల్యేలు బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ బెల్లాడ్ వంటి నాయకులు వీరశైవ-లింగాయత్ సమాజానికి చెందినవారు.

ఇదిలావుంటే, తానే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రినంటూ పౌర, ఆహార సరఫరా శాఖ మంత్రి ఉమేష్ కత్తి బెళగావిలో వ్యాఖ్యానించడం కర్ణాటక బీజేపీలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. నాయకత్వ మార్పు కచ్చితంగా జరిగితే.. ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు సార్లు మంత్రిగా పనిచేసిన తనకే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఉమేశ్ కత్తి వ్యాఖ్యానించారు. అటు, ముఖ్యమంత్రి స్థానం అశిస్తున్న వారిలో ఎమ్మెల్యేలు బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ బెల్లాడ్ వంటి నాయకులు వీరశైవ-లింగాయత్ సమాజానికి చెందినవారు. ఏదేమైనా.. మొత్తం మీద కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. నాయకత్వ మార్పుపై ఒకవేళ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని ఉంటే.. ఆ నిర్ణయమే తనకు శిరోధార్యమని యడియూరప్ప ప్రకటించడం గమనార్హం.

Read Also…  China Rains: చైనాలో వర్ష బీభత్సం.. జలదిగ్భంధంలో హెనాన్‌ ప్రావిన్స్‌ ప్రాంతం.. 12మంది మృతి, పలువురు గల్లంతు!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu