Parliament Attacks: పార్లమెంట్‌పై దాడికి కోల్‌కత్తాలో పథక రచన, మైసూరు, ముంబైలో సమావేశాలు.. ఢిల్లీలో అమలు

| Edited By: Srikar T

Dec 15, 2023 | 10:23 AM

పార్లమెంట్ భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపిన 'కలర్ స్మోక్' (రంగు పొగ) ఘటనపై దర్యాప్తులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ కుట్రకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో పథక రచన జరిగిందని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురితో పాటు పరారీలో ఉన్న 6వ నిందితుడు లలిత్ ఝా గురువారం రాత్రి ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇతనే ఈ మొత్తం గ్యాంగ్‌కు నాయకత్వం వహించాడని పోలీసులు గుర్తించారు.

Parliament Attacks: పార్లమెంట్‌పై దాడికి కోల్‌కత్తాలో పథక రచన, మైసూరు, ముంబైలో సమావేశాలు.. ఢిల్లీలో అమలు
Delhi Parliament Attacks
Follow us on

పార్లమెంట్ భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపిన ‘కలర్ స్మోక్’ (రంగు పొగ) ఘటనపై దర్యాప్తులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ కుట్రకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో పథక రచన జరిగిందని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురితో పాటు పరారీలో ఉన్న 6వ నిందితుడు లలిత్ ఝా గురువారం రాత్రి ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇతనే ఈ మొత్తం గ్యాంగ్‌కు నాయకత్వం వహించాడని పోలీసులు గుర్తించారు. ఇదివరకే అరెస్టయిన ఐదుగురిలో నలుగురిని న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అప్పగించగా.. లలిత్ ఝాను నేడు కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరనున్నారు. తాజాగా వీరితో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు కైలాశ్, మహేశ్‌లను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అదుపులోకి తీసుకుంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో అనేక అంశాలు బయటపడ్డాయి.

అందరినీ కలిపిన ఫ్యాన్ పేజి

లోక్‌సభ జీరో అవర్ జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకి హంగామా చేసిన ఇద్దరిలో డి. మనోరంజన్ (33) ఒకరు. మైసూరుకు చెందిన మనోరంజన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఓ ఐటీ కంపెనీలో కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశాడు. కానీ ఆ ఉద్యోగం పోవడంతో తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తున్నాడు. సభలోకి దూకిన మరో నిందితుడు సాగర్ శర్మ (25). లక్నోలో ఈ-రిక్షా నడుపుకునే సాగర్ శర్మ 12వ తరగతి వరకు మాత్రమే చదివాడు. సాగర్ తండ్రి కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థికంగా తగిన వనరులు లేకపోవడంతో సాగర్ ఉన్నత విద్యను అందుకోలేకపోయాడు.

పార్లమెంట్ వెలుపల, ట్రాన్స్‌పోర్ట్ భవన్ మీడియా పాయింట్ వద్ద ‘కలర్ స్మోక్’ ప్రయోగించి నినాదాలు చేసిన ఆమోల్ షిండే (25) మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందినవాడు. ఆర్మీలో ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. మరోసారి ప్రయత్నిద్దాం అనుకుంటే వయస్సు మీరిపోయింది. ఆమోల్‌తో పాటు నినాదాలు చేసిన మహిళ పేరు నీలం ఆజాద్ (37). హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన నీలం, ఎంఏ, ఎంఈడీ, ఎం.ఫిల్ కూడా చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)లో కూడా క్వాలిఫై అయింది. కానీ ఎక్కడా అధ్యాపక ఉద్యోగం లభించలేదు.

ఇవి కూడా చదవండి

వీరికి సహకరించిన గురుగ్రాం నివాసి విశాల్ (విక్కీ) శర్మ, తాజాగా అరెస్టయిన మహేశ్, కైలాశ్‌ల నేపథ్యం కూడా దాదాపు ఇలాంటిదే. రాత్రి అరెస్టయిన లలిత్ ఝా స్వస్థలం బిహార్. కానీ కోల్‌కత్తాలో కొన్నాళ్లు అధ్యాపకుడిగా పనిచేశాడు. ఈ అందరినీ ఒక వేదికపై తెచ్చిన అంశం నిరుద్యోగం. అందుకు కారణం ప్రభుత్వాలు, వాటి విధానాలే అన్న భావన వారిలో బలంగా ఏర్పడింది. సరిగ్గా ఇలాంటి ఆలోచనతో ఉన్న అందరినీ “భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్” పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజి ఆకట్టుకుంది. అక్కడ వీరంతా ఒకరికొకరు పరిచమయయ్యారు. ఆ ఫేస్‌బుక్ పేజిలో ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి రైతులు జరిపిన ఆందోళనలు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రెజ్లర్లు చేసిన ఆందోళనలు, మణిపూర్ అల్లర్లు.. ఇలా దేశంలోని అనేక సమస్యలపై పోస్టులు ఉన్నాయి. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే కారణం అని భావించారు. “ప్రధాని మిస్సింగ్” అనే పాంఫ్లెంట్లు రూపొందించారు. ఆయన్ను పట్టుకుని తెచ్చినవారికి స్విస్ బ్యాంకు నుంచి నగదు బహుమతి ఇస్తామంటూ అందులో పేర్కొన్నారు.

అఫ్జల్‌గురును అనుసరించిన భగత్ సింగ్ భక్తులు

1929లో నాటి బ్రిటీష్ ప్రభుత్వ నిరంకుశ, అణచివేత ధోరణిని వ్యతిరేకిస్తూ భగత్ సింగ్ ఢిల్లీలోని పార్లమెంట్ (అప్పట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ)పై దాడికి పాల్పడిన ఘటన గురించి పాఠ్యాంశాల్లో లేదా మరెక్కడైనా చదివే ఉంటారు. నాటి ప్రభుత్వం దీన్ని ఉగ్రవాద చర్యగానే పరిగణించి ఉరికంబం ఎక్కించింది. కానీ భారత సమాజం భగత్ సింగ్‌ను స్వాతంత్య్ర సమరయోధుడిగా కీర్తించింది. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఇదొక కీలక ఘట్టంగా నిలిచింది. అయితే భగత్ సింగ్ భక్తులుగా మారిన ఈ ఆరుగురు కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై భగత్ సింగ్ బాటలోనే తమ నిరసన వ్యక్తం చేయాలి అనుకున్నారు. కానీ ఇప్పుడున్నది భారతీయులను దోచుకున్న బ్రిటీష్ పాలకులు, ప్రభుత్వం కాదు. భారతీయులే రూపొందించుకున్న రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం.

ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. చట్టం, రాజ్యాంగం పరిధిలో ఎవరైనా తమ నిరసన వ్యక్తం చేయవచ్చు. కానీ వీరంతా 2001లో పార్లమెంటుపై దాడి ఘటనలో సూత్రధారి అఫ్జల్‌గురును అనుసరించారు. పార్లమెంట్ భద్రతను నిశితంగా గమనించారు. ఒకట్రెండు పర్యాయాలు విజిటర్ పాసులు తీసుకుని రెక్కీ కూడా నిర్వహించారు. ఎన్ని చోట్ల, ఎన్ని రకాల తనిఖీలు జరుగుతాయో స్పష్టమైన అవగాహన ఏర్పడింది. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లతో పాటు భౌతికంగా సెక్యూరిటీ సిబ్బంది చేసే తనిఖీల్లో డొల్లతనం ఒకటి గ్రహించారు. కాలికి ఉన్న ‘షూ’ను విప్పి చూసే పరిస్థితి లేదు అని తెలుసుకున్నారు. అంతే.. సరిగ్గా ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడికి పాల్పడిన డిసెంబర్ 13న ‘కలర్ స్మోక్’ క్యాన్లను ‘షూ’లో దాచుకుని, విజిటర్ పాసు మీద లోపలికి వెళ్లారు. సభలోకి దూకి దాన్ని ప్రయోగించారు.

కోల్‌కత్తా టూ ఢిల్లీ.. వయా మైసూర్

పార్లమెంట్‌పై దాడికి పథక రచన కోల్‌కత్తాలో జరిగిందని కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గుర్తించింది. దాడికి సూత్రధారి లలిత్ ఝా అని భావిస్తోంది. కోల్‌కత్తాలో అధ్యాపకుడిగా కొన్నాళ్లపాటు పనిచేసిన లలిత్ ఝాకు, అక్కడి కొన్ని స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలున్నాయి. ఫ్యాన్ పేజి ద్వారా పరిచయమైన మిగతా అందరితో తరచుగా మాట్లాడి, వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకతను నూరిపోసేవాడు. అప్పటికే నీలం అనేక ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో స్వయంగా పాల్గొంది. రైతుల ఆందోళన, రెజ్లర్ల ఆందోళనలోనూ కనిపించింది. ఏడాదిన్నర క్రితం ఒకసారి వీరంతా మైసూరులో సమావేశమయ్యారు. ఆ తర్వాత కూడా మరోచోట భేటీ అయ్యారు. తాజాగా గురుగ్రాంలోని విక్కీ శర్మ నివాసంలో ఉండి పార్లమెంటుపై దాడికి పథక రచన చేశారు.

డిసెంబర్ 13న ఎంతమందికి పాసులు లభిస్తే అంతమంది లోపలికి వెళ్లాలని అనుకున్నారు. కానీ మనోరంజన్, సాగర్ శర్మకు మాత్రమే పాసులు లభించాయి. దీంతో నీలం, ఆమోల్ షిండేలను పార్లమెంట్ గేట్ బయటనే నిరసన తెలిపేలా లలిత్ ఝా సూచించారు. ఈ ప్రదర్శనను లలిత్ ఝా, విక్కీ శర్మ తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. పోలీసులు నీలం, ఆమోల్ షిండేలను పట్టుకోవడం ఇద్దరూ పారిపోయారు. ఆ తర్వాత విక్కీ శర్మను పోలీసులు పట్టుకోగా, ఇక తాను కూడా దొరికిపోవడం ఖాయం అనుకున్న లలిత్ ఝా స్వయంగా వచ్చి లొంగిపోయాడు. వీరితో సంబంధాలు కలిగి సహకరించిన మరో ఇద్దరు మహేశ్, కైలాశ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు లలిత్ ఝా తన మొబైల్‌లో చిత్రించిన వీడియోను వెంటనే కోల్‌కత్తాలో ఉన్న ఓ స్వచ్చంద సంస్థ నిర్వాకుడు నిలాక్ష్ ఐష్‌కు పంపించాడు. నీలాక్ష్‌ను ప్రశ్నించేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీమ్ ఒకటి ఇప్పటికే కోల్‌కత్తా బయలుదేరింది. మరోవైపు రాత్రి లొంగిపోయిన లలిత్ ఝా, అదుపులోకి తీసుకున్న మహేశ్, కైలాశ్‌తో పాటు కోర్టు కస్టడీకి అప్పగించిన నలుగురు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా వీరి వెనుక ఎవరెవరున్నారన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..