శివమొగ్గ, నవంబర్ 24: స్కూళ్లో చదువుతోన్న తన కుమార్తెకు టీచర్ బలవంతంగా కోడిగుడ్లు తినిపించినట్లు విద్యాశాఖ అధికారులకు ఓ తండ్రి ఫిర్యాదు చేశారు. రెండో తరగతి చదువుతోన్న తన కుమార్తె పూర్తిగా శాఖాహారని, గుడ్డు తినడం వల్లే తన కుమార్తె అస్వస్థతకు గురైందని సదరు టీచర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్ధిని (7)తో పాఠశాల టీచర్ బలవంతంగా గుడ్డు తినిపించాడు. దీంతో సదరు విద్యార్ధిని అస్వస్థతకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి అసలు విషయం తండ్రికి చెప్పడంతో ఈ సంగతి బయటపడింది. దీంతో చిన్నారి తండ్రి విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశాడు.
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా తన కూతురికి గుడ్లు తినాలని బలవంతం చేశారని తెలిపారు. తద్వారా తమ మనోభావాల్ని దెబ్బతీశారన్నారు. తాము కఠినమైన శాకాహార నియమాలు ఫాలో అవుతామని స్కూల్ యాజమన్యానికి ముందే చెప్పామన్నారు. అయినా సరే టీచర్ తన కూతురికి బలవంతంగా గుడ్డు తినిపించారని అతడు ఆరోపించారు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే కొడతానని టీచర్ చిన్నారిని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. పైగా చిన్నారి సామాజిక వర్గానికి చెందిన వారు గుడ్డు తింటే ఏమీ కాదని టీచర్ చెప్పినట్లు చిన్నారి తెలిపిందన్నారు.
పిల్లలకు గుడ్లు, ప్రోటీన్ బార్లు, అరటిపండ్లు తినిపించాలని ప్రభుత్వం నుంచి ఆర్డర్ ఉంది. అయితే తమ పిల్లలకు ఎలాంటి ఆహార పదార్థాలు అందించవచ్చనే దానిపై తల్లిదండ్రులందరినీ కూడా సమావేశానికి పిలవాలి. కానీ ఒక టీచర్ గత వారం రోజులుగా తమ కుమార్తెను గుడ్లు తినమని బలవంతం చేస్తున్నాడని చిన్నారి తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ చర్యకు పాల్పడిన పాఠశాల టీచర్, ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ అధికారులు ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. అయితే చిన్నారి తండ్రి చేసిన ఆరోపణల్ని స్కూల్ ఉపాధ్యాయులు కొట్టిపారేశారు. పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి మాత్రమే ప్రేరేపించామని స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు.
మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులంతా వరుసలో కూర్చున్నారు. అప్పుడు టీచర్ గుడ్లు కావాల్సిన వారిని చేతులు ఎత్తాలని సూచించారు. తోటి విద్యార్ధులతో ఈ చిన్నారి కూడా చేతులు ఎత్తినట్లు టీచర్ గుర్తించాడు. దీంతో ఆమెకు కూడా గుడ్డు ఇచ్చారని.. అంతేగానీ ప్రత్యేకంగా ఈ చిన్నారి గుడ్లు తినాలని ఎవరూ బలవంత పెట్టలేదని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నేరం నిరూపణ అయితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని శివమొగ్గ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ పరమేశ్వరప్ప తెలిపారు. చిన్నారితో బలవంతంగా గుడ్డు తినిపించడంపై తండ్రి ఫిర్యాదు చేయడం స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.