
తమిళనాడులో జాబ్ పోగొట్టుకున్న మహిళా డ్రైవర్ షర్మిలకు అండగా నిలిచారు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్. ఉద్యోగం కోల్పోయిన ఆ మహిళా డ్రైవర్‌ను పార్టీ ఆఫీస్‌కు పిలిపించి.. ఓ కారును గిఫ్ట్‌గా ఇవ్వడంతోపాటు ఆర్థికసాయం అందజేశారు. పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి ఇటీవల కొయంబత్తూర్లోని గాంధీపురం నుంచి పీలమేడు వరకు షర్మిల్ నడుపుతున్న ప్రైవేట్ సంస్థకు చెందిన బస్సులో ట్రావెల్ చేశారు. అయితే.. ఆ బస్సును నడుపుతోన్న షర్మిల అనే మహిళా డ్రైవర్ ప్రతిభను మెచ్చుకుంటూ.. కనిమొళి ఆమెకు చేతి గడియారాన్ని బహూకరించారు. అయితే.. ఆ సమయంలో తాను నడిపిన బస్సులో ట్రైనీ మహిళా కండక్టర్.. ఎంపీ కనిమొళితో అనుచితంగా ప్రవర్తించిందంటూ షర్మిల తన యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం వివాదానికి దారితీసింది.
మరోవైపు… తన పాపులారిటీ కోసం బస్సులో ప్రయాణించేందుకు తరచుగా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ.. ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నట్లు ఆ కండక్టర్ కూడా షర్మిలపై ఫిర్యాదు చేసింది. ఇలా ఇరువురి వాదనల నేపథ్యంలో షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించించింది యాజమాన్యం. దాంతో.. డ్రైవర్ ఉద్యోగం నుంచి షర్మిలను తొలగించిన విషయం చర్చనీయాంశమైంది. అయితే.. ఎంపీ కనిమొళిని కలవడమే షర్మిల ఉద్యోగం పోవడానికి కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇది కాస్తా.. కమల్ హాసన్ దృష్టికి వెళ్లడంతో ఆమెకు కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా.. ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న షర్మిల.. ఇకనుంచి ఎంతో మందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఆకాంక్షించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల ఎదుగుదలను అడ్డుకోవడం మంచిదికాదన్నారు కమల్‌హాసన్.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి