సీఏఏని నిరసిస్తూ ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేసిన సందర్భంగా పోలీసులు అక్కడి లైబ్రరీలోకి ప్రవేశించి అక్కడే ఉన్న వారిపై లాఠీలు ఝళిపించారు. దొరికినవారిని దొరికినట్టు చావబాదారు. పోలీసులకు దొరకకుండా కొందరు విద్యార్థులు బల్లల కింద దాక్కోగా, మరికొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ పోలీసు దాష్టీకం తాలూకు 49 సెకండ్ల వీడియోను ‘జామియా కో-ఆర్డినేషన్ కమిటీ’ విడుదల చేసింది. (పాత, కొత్త విద్యార్థులతో ఈ కమిటీ ఏర్పాటైంది). సీఏఏకి వ్యతిరేకంగా గత డిసెంబరు 15 న జామియా మిలియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థులు జరిపిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. నాడు పోలీసులకు, వారికి మధ్య జరిగిన ఘర్షణల్లోపలువురు గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. లైబ్రరీలోకి ఎంటరయి.. అక్కడా లాఠీలకు పని చెప్పారు. అనేకమంది విద్యార్థులను అరెస్టు చేశారు.
CCTV footage has emerged showing police assaulting Jamia students without provocation. Horrifying. Exemplary punishment must be levied on these lawless policemen. https://t.co/3AXhSuKf7A
— Shashi Tharoor (@ShashiTharoor) February 16, 2020
కాగా-ఈ సీసీటీవీ ఫుటేజీపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోలీసులమీద ట్వీట్లతో విరుచుకుపడింది. యూనివర్సిటీ లైబ్రరీలోకి పోలీసులు ప్రవేశించలేదని, విద్యార్థులపై లాఠీఛార్జి కూడా చేయలేదని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన అబధ్ధమని ఈ వీడియో నిరూపిస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఈ పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అటు-మరో నేత శశిథరూర్ కూడా ఈ వీడియోపై స్పందిస్తూ.. తక్షణమే ఆ పోలీసులను అరెస్టు చేయాలని ఆయన కోరారు.