ఈజీ మనీ కావాలనుకున్నాడు. కొడితే బ్యాంక్‌నే కొట్టాలనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. తెగింపు సినిమా చూశాడు. తెగించి బ్యాంక్‌లో దొంగతనానికి బయల్దేరాడు. సూపర్ స్టార్, అన్న అజిత్‌ని ఫాలో అయిపోయాడు మెచ్యూరిటీ లేని అమెచ్యూర్ దొంగ. రీల్ సీన్ వేరు. రియాలిటీ వేరు అన్నది సీన్ సితార్ అయ్యాక కానీ మనోడికి అర్థం కాలేదు. ఇదో గ్రేట్ బ్యాంక్ రాబరీ కథ. హాలీవుడ్ మూవీ కాదు. బాల్ బచ్చా దొంగ వ్యథ. సినిమా చూసి సూపర్ స్కెచ్ వేసినా బ్యాంక్ రాబరీ తూచ్ అయిపోయింది.
చేతిలో బాంబ్ పట్టుకుని, మై హు గబ్బర్ సింగ్ అనే లెవెల్లో గన్ ఊపుకుంటూ బ్యాంక్‌కి వెళ్లాడు. అంతా భయపడిపోయి వంగి సలాం కొట్టి నోట్ల కట్టలు ఉన్న బ్యాగులు ఇచ్చేస్తారనుకున్నాడు. సీన్ కట్ చేస్తే బ్యాంక్ దొంగతనానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. అందరు హ్యాండ్స్ అప్ అన్న దొంగోడికి చివరకు హ్యాండ్ కఫ్స్ పడ్డాయి. తమిళనాడు తిరుప్పూర్‌లోని కెనరా బ్యాంక్‌లోకి బురఖా వేసుకుని, గన్, బాంబు పట్టుకుని దొంగతనానికి వెళ్లిన సురేష్ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
పాలిటెక్నిక్ చదువుతున్న సురేష్ ఈమధ్యే అజిత్ కుమార్ నటించిన తెగింపు సినిమా చూశాడు. అందులో దొంగతనం సీన్ చూసి సురేష్ తెగ ఇన్‌స్పిరేషన్ పొందాడు. వెంటనే ఆన్‌లైన్‌లో డమ్మీ గన్, డమ్మీ టైమ్ బాంబ్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. బుర్ఖా ఒకటి కుట్టించుకున్నాడు. ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు తెగ చూశాడో ఏమో కానీ ముఖానికి ఓ మాస్క్ కూడా తయారు చేయించుకున్నాడు. ఇలా సరుకు సరంజామా అంతా సిద్ధం చేసుకున్న సురేష్ పోయిన శనివారం బ్యాంక్‌లో దొంగతనానికి ముహూర్తం పెట్టుకున్నాడు. తిరుప్పూర్‌లోని ధరాపురం ఏరియాలోని కెనరా బ్యాంక్‌ని ఎంచుకున్నాడు. అయితే శనివారం శని బాలేదో ఏమో కానీ డ్యామిట్ దొంగతనం అడ్డం తిరిగి అడ్డంగా బుక్కయిపోయాడు.
బురఖా వేసుకుని ముఖానికి మాస్క్ కూడా పెట్టుకుని, గన్ చేత పట్టుకుని, బాంబ్ పట్టుకుని దర్జాగా బ్యాంక్‌లోకి వెళ్లాడు ఈ కొత్త దొంగోడు. ఆ తర్వాత డమ్మీ గన్ చూపిస్తూ బ్యాంక్ స్టాఫ్‌ని, కస్టమర్లను భయపెట్టేందుకు తెగ కష్టపడ్డాడు మన స్టూడెంట్ తీఫ్. బ్యాంక్‌లో అందరిని బెదిరిస్తూ డబ్బులివ్వమని అదిలిస్తూ హల్‌చల్ చేశాడు సురేష్. అలా అతగాడు బ్యాంక్‌లో అటు ఇటు తిరుగుతున్న టైమ్‌లో కర్మ కాలి చేతిలో ఉన్న వెపన్ కిందపడింది. దాన్ని తీసుకోవడానికి అతడు కిందకు వంగాడు. అంతే ఈ తత్తర బిత్తర దొంగోడ్ని చూసిన ఓ పెద్దాయన ఇదే టైమ్‌రా నాయనా అనుకుని పైన కండువా తీసి సురేష్ మీద వేసి అతడ్ని కట్టేసి చితక్కొట్టేసి పోలీసులకు అప్పగించడం చకచకా జరిగిపోయింది.
జనం చితక్కొట్టడంతో గాయపడ్డ సురేష్‌ను అరెస్ట్ చేసి మొదట హాస్పిటల్‌కి తీసుకువెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించిన పోలీసులు తర్వాత తమ ట్రీట్‌మెంట్ కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం