ఇది దేశ అంతర్గత విషయం.. ఐరాస జోక్యంపై భారత్ తీవ్ర ఆగ్రహం

ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) రద్దు డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై భారత్ అభ్యంతరం తెలుపుతూ, దేశ అంతర్గత వ్యవహారాల్లో అనవసర జోక్యంగా అభివర్ణించింది. నిరసనకు అనుమతి నిరాకరించిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సీజీపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ నిర్బంధంలో ఉన్నట్లు తాజా వార్తా నివేదికలు పేర్కొన్నాయి.

ఇది దేశ అంతర్గత విషయం.. ఐరాస జోక్యంపై భారత్ తీవ్ర ఆగ్రహం
Cjp Delhi Protest

Updated on: Oct 11, 2026 | 9:09 AM

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆందోళనలు దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.. అయినప్పటికీ.. సీజేపీ నిరసనలు చేపడతామని పేర్కొనడంతో.. భారీగా.. పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు.. అంతేకాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగాయి.. చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి (UN) చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ నిరసనలు, నిర్బంధాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR) ఆందోళన వ్యక్తం చేయడాన్ని భారత్ తప్పుబట్టడంతోపాటు ఇది దేశ అంతర్గత విషయాల్లో అనవసర జోక్యం వద్దు అంటూ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ రాజ్యాంగబద్ధంగా భావప్రకటన స్వేచ్ఛ ఉందని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం చట్టపరమైన ఆంక్షలు విధించే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు నిరాధారమైనవని, ఐరాస తన నిబంధనల ప్రకారం ఇతర ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసనలపై దృష్టి పెట్టాలని హితవు పలిచింది.

భారీ నిర్బంధాలు – అరెస్టులు:

జంతర్ మంతర్ వద్ద చేపట్ట తలపెట్టిన నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,000 మందికి పైగా ఆందోళనకారులు, ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. నిరసనకారులు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా.. ఎస్ఐఆర్ రద్దు.. తదితర డిమాండ్లు నెరవేరే వరకు జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇవాళ కూడా ఆందోళలకు పిలుపునిచ్చారు. తమ నాయకులు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారని.. జ్ఞానేష్ కుమార్‌ను సీఈసీ పదవి నుంచి తొలగించేంత వరకు, ఇకపై ప్రతిరోజూ జంతర్ మంతర్ వరకు మార్చ్ జరుగుతుందని సీజేపీ నాయకుడు అజింక్య షిండే తెలిపారు.

కాగా.. నిన్న అరెస్టయిన వారిలో 3,000 మందిని.. పోలీసులు విడుదల చేశారు. అభిజీత్ దీప్కే, ధృవ్ రాఠీ, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు.. వారిని విడుదల చేయలేదు.. వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది.. రాజధానిలో భద్రతా కారణాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతతోపాటు.. భారీ ఎత్తున బలగాలను మోహరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us