బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తేదీ ఆగస్టు 15. విదేశీ శక్తులు భారతదేశ పాలనా పగ్గాలను దేశ నాయకులకు అప్పగించాయి. అయితే దేశం పొందిన స్వేచ్ఛ వెనుక అనేక మంది త్యాగాలు.. వేలాది ప్రజల పోరాటం ఉంది. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. అయితే ఆ యోధుల్లో ఒకరికి ‘జాతి పితామహుడు’ హోదా ఉంది. మహాత్మా గాంధీని మొదట జాతిపిత అని ఎవరు పిలిచారో తెలుసా..
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సాధారణ కుటుంబంలో జన్మించారు. అహింసనే ఆయుధంగా చేసుకుని యావత్ ప్రపంచం ఆలోచనలను మార్చేశాడు. గాంధీజీ ప్రారంభించిన స్వేచ్ఛ, శాంతి కార్యక్రమాలు భారతదేశం, దక్షిణాఫ్రికాలో అనేక చారిత్రక ఉద్యమాలకు కొత్త దిశను నిర్దేశించాయి. గాంధీ మొదటి సత్యాగ్రహం 1917లో బీహార్‌లోని చంపారన్ జిల్లాలో మొదలు పెట్టారు. అప్పటి నుండి మహాత్మా గాంధీ భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారారు.
మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మహాత్మాగాంధీని జాతిపిత అని పిలిచే మొదటి వ్యక్తి అని సాధారణ అభిప్రాయంగా వినిపిస్తుంది. అయితే నివేదిక ప్రకారం గాంధీజీ మరణానంతరం, అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రేడియో ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘జాతికి తండ్రి ఇక లేరు’ అని చెప్పారు. అయితే ఆయన కంటే ముందే మరో కాంగ్రెస్ నాయకుడు మహాత్మా గాంధీని ‘జాతి పితామహుడు’ అని పిలిచారు. అతనే భరత మాత ముద్దు బిడ్డ సుభాష్ చంద్రబోస్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేతాజీ బోస్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడానికి పరోక్షంగానైనా సరే ప్రధాన కారణం మహాత్మా గాంధీ.
1939 జనవరిలో కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది. 1938లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్ ఈసారి కూడా అంటే 1939లో కూడా సుభాష్ కాంగ్రెస్ రాష్ట్రపతి పదవిని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే మహాత్మా గాంధీ దీనికి అంగీకరించలేదు. రాష్ట్రపతి పదవికి జవహర్ లాల్ నెహ్రూ పేరుని సూచించారు. నెహ్రూ నిరాకరించిన తరువాత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను అభ్యర్థించారు.. అయితే అనారోగ్య కారణాలతో మౌలానా వెనక్కి తగ్గారు. చివరికి మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పట్టాభి సీతారామయ్య పేరును తెరపైకి టీసుకుని వచ్చారు.
గాంధీజీ మద్దతు ఉన్నప్పటికీ జనవరి 29, 1939న కాంగ్రెస్ అధ్యక్ష పదివి కోసం జరిగిన ఎన్నికల్లో పట్టాభి సీతారామయ్యకు 1377 ఓట్లు వచ్చాయి. నేతాజీ బోస్‌కు 1580 లభించాయి. అప్పటి వరకు జవహర్ లాల్ నెహ్రూ మినహా.. ఎవరూ వరసగా రెండో సారి పదవిని చేపట్టలేదు. అయితే గాంధీ సపోర్ట్ చేసిన పట్టాభి సీతారామయ్య ఓటమిని చవి చూశారు. ఈ ఓటమిని గాంధీ తన ఓటమిగా భావించారు.
అయితే విషయం ఇక్కడితో ముగియలేదు. మరుసటి నెల 20-21 ఫిబ్రవరి 1939లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వార్ధాలో జరిగింది. ఆరోగ్య కారణాల వల్ల సుభాష్ బాబు హాజరు కాలేదు. వార్షిక సమావేశం వరకు సమావేశాన్ని వాయిదా వేయాలని ఆయన పటేల్‌ను కోరారు. దీనిపై సుభాష్ చంద్ర బోస్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపిస్తూ పటేల్, నెహ్రూ సహా 13 మంది సభ్యులు వర్కింగ్ కమిటీకి రాజీనామా చేశారు. బోస్ గైర్హాజరైనప్పుడు కాంగ్రెస్ సాధారణ పనిని నిర్వహించడానికి అనుమతించడం లేదని ఆరోపించారు.
దీని తరువాత 1939 మార్చి 8 నుండి 12 వరకు త్రిపురి (జబల్‌పూర్)లో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఇందులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలోని 160 మంది సభ్యులు ఒక ప్రతిపాదనను సమర్పించారు.. అందులో కాంగ్రెస్ గాంధీ మార్గంలో మాత్రమే ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజ్యాంగంలో ఇచ్చిన వర్కింగ్ కమిటీని ఎన్నుకునే అధ్యక్షుడి హక్కును కూడా తొలగించింది.
అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్ శక్తిహీనులయ్యారు. పండిట్ నెహ్రూ వర్కింగ్ కమిటీ సభ్యులకు క్షమాపణ చెప్పాలని..అధ్యక్ష పదవీకాలం పూర్తి చేయాలని సుభాష్ ను కోరినా సుభాష్ తలవంచలేదు. తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు.
గాంధీజీని సుభాష్ బోస్ చాలా గౌరవించేవారు. అయితే సుభాష్ చంద్ర బోస్ కు గాంధీజీ కోరిక అంతిమ నిర్ణయం కాదు. 1940లో కాంగ్రెస్ పథకాలకు దూరంగా పనిచేస్తున్న సుభాష్ ను అరెస్టు చేశారు. గాంధీజీ 1940 జూలై 9న సేవాగ్రామ్‌లో ‘సుభాష్ వంటి గొప్ప వ్యక్తిని అరెస్టు చేయడం సామాన్యమైన విషయం కాదు.. అయితే సుభాష్ తన పోరాటాన్ని ఎంతో అవగాహనతో, ధైర్యంగా ప్లాన్ చేసుకున్నారు’ అని అన్నారు.
బ్రిటిష్ వారి బారి నుండి తప్పించుకుని సుభాష్ చంద్రబోస్ జూలై 1943లో జర్మనీ నుంచి జపాన్ నియంత్రణలో ఉన్న సింగపూర్ చేరుకున్నారు. జూన్ 4, 1944 న, సుభాష్ చంద్రబోస్ సింగపూర్ రేడియో నుండి ఒక సందేశాన్ని ప్రసారం చేసారు. మహాత్మా గాంధీని జాతిపిత అని సంబోధించారు.
సుభాష్ బోస్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం చివరి పోరాటం ప్రారంభమైంది. బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టే వరకు ఈ సాయుధ పోరాటం కొనసాగుతుంది. కాసేపు ఆగి ‘జాతి పితామహుడు భారతదేశ స్వాతంత్ర్య కోసం పోరాటం చేస్తున్న మేము మీ ఆశీస్సులు కోరుతున్నాము’ అని చెప్పాడు.
విమాన ప్రమాదంలో సుభాష్ బోస్ మరణించారనే వార్తపై గాంధీజీ ‘అతనిలాంటి దేశభక్తుడు మరొకరు లేరనీ, ఆయన దేశభక్తుల యువరాజు’ అని అన్నారు. 1946 ఫిబ్రవరి 24న తన ‘హరిజన్’ పత్రికలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ మాయాజాలం మనపై వ్యాపించింది. నేతాజీ పేరు దేశమంతా మారుమోగుతోంది. అతను అసాధారణమైన దేశభక్తుడు. సుభాష్ ధైర్యసాహసాలు.. దేశ చరిత్రలో ప్రకాశిస్తాయన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..