గంటల పసికందులే వీరి టార్గెట్.. పక్కా స్కెచ్‌తో మస్కా.. ‘ఆపరేషన్ దేవ్’తో వెలుగులోకి సంచలనాలు!

అంతర్రాష్ట్ర స్థాయిలో పసిబిడ్డల విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న ఒక భారీ నెట్‌వర్క్‌ను గుజరాత్ పోలీసులు ఛేదించారు. కేవలం అండదాతల బ్రోకర్‌గా మొదలై, చివరకు నవజాత శిశువుల స్మగ్లర్‌గా మారిన తెలంగాణకు చెందిన ఒక ముఠా నాయకుడి ఆగడాలకు బనస్కాంత పోలీసులు అడ్డుకట్ట వేశారు.

గంటల పసికందులే వీరి టార్గెట్.. పక్కా స్కెచ్‌తో మస్కా.. ఆపరేషన్ దేవ్తో వెలుగులోకి సంచలనాలు!
Operation Dev

Updated on: Apr 21, 2026 | 10:56 AM

అంతర్రాష్ట్ర స్థాయిలో పసిబిడ్డల విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న ఒక భారీ నెట్‌వర్క్‌ను గుజరాత్ పోలీసులు ఛేదించారు. కేవలం అండదాతల బ్రోకర్‌గా మొదలై, చివరకు నవజాత శిశువుల స్మగ్లర్‌గా మారిన తెలంగాణకు చెందిన ఒక ముఠా నాయకుడి ఆగడాలకు బనస్కాంత పోలీసులు అడ్డుకట్ట వేశారు.

ఏప్రిల్ నెల ప్రారంభంలో గుజరాత్‌లోని వడ్గాం ప్రాంతంలో ఒక నాలుగేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బనస్కాంత పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడిని సురక్షితంగా కాపాడటమే కాకుండా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అయితే, వారిని లోతుగా విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కిడ్నాప్ వెనుక ఒక చిన్న ముఠా మాత్రమే కాదు, ఏకంగా రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించిన ఒక ‘చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్’ ఉందని పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ – కాగజ్‌నగర్ కేంద్రంగా సాగుతున్న భారీ శిశు విక్రయాల ముఠాను గుజరాత్ పోలీసులు రట్టు చేశారు. “ఆపరేషన్ దేవ్” పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో తెలంగాణకు చెందిన మురుగన్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. గుజరాత్‌లో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలుడు దేవ్ ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలో, AI టూల్స్, సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు ఈ ముఠా గుట్టు విప్పారు. మురుగన్‌తో పాటు కరీంనగర్‌కు చెందిన తిరుపతి, మల్లయ్య, గంగాధర్, మురుగన్ భార్య కృష్ణవేణిని నిందితులుగా గుర్తించారు. ఈ ముఠా పుట్టిన 48 గంటల్లోపే పసిబిడ్డలను ఎత్తుకెళ్లి విక్రయించేవారు. ఇప్పటివరకు సుమారు 8 మంది చిన్నారులను అమ్మినట్లు పోలీసులు తెలిపారు.

ఒక జువెనైల్ ఇచ్చిన కీలక సమాచారంతో ఈ అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా దందా వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఈ అక్రమ రవాణాకు సూత్రధారి తెలంగాణలో ఉన్నట్లు గుర్తించారు. వీరి నివాసం తెలంగాణ రాష్ట్రం కావడంతో, ఇతర రాష్ట్రాల్లోని నెట్‌వర్క్‌పై దృష్టి సారించారు. ప్రస్తుతం పోలీసులు ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

మురుగన్ మొదట్లో IVF కేంద్రాలకు అవసరమైన ‘అండదాతలను’ (Egg Donors) సరఫరా చేసే బ్రోకర్‌గా పనిచేసేవాడు. సరోగసీకి సిద్ధపడే మహిళలను నిస్సంతాన దంపతులకు పరిచయం చేస్తూ ఒక్కో కేసుపై రూ. 5,000 నుండి రూ. 6,000 వరకు కమీషన్ పొందేవాడు. అయితే, ఈ ఆదాయం సరిపోకపోవడంతో మరింత డబ్బు కోసం ‘శిశు విక్రయాల’ బాట పట్టాడు. ఈ ముఠా అత్యంత దారుణంగా వ్యవహరించేదని పోలీసులు తెలిపారు. ఆసుపత్రులు, పేద వర్గాల్లో పుట్టిన శిశువులపై కన్నేసేవారు. శిశువు జన్మించిన 24 నుండి 48 గంటల్లోపే వారిని అపహరించడం లేదా తల్లిదండ్రులను ప్రలోభపెట్టి స్వాధీనం చేసుకునేవారు. ఒక్కో శిశువును లక్షల రూపాయలకు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోని మధ్యవర్తుల ద్వారా విక్రయించేవారని పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం పోలీసుల విచారణలో తెలంగాణ నుండి ముగ్గురు, గుజరాత్, మహారాష్ట్రల నుండి ఇద్దరేసి, ఢిల్లీ నుండి ఒకరి చొప్పున మొత్తం ఎనిమిది మంది పసిబిడ్డలను విక్రయించినట్లు ఆధారాలు లభించాయి. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us