3 నెల్లల్లో పెళ్లి.. కలకాలం కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి

వాళ్లిద్దరూ బ్యాంక్ ఉద్యోగులు.. ఇద్దరిదీ ఒకే బ్యాంక్.. అయినా పనిచేసేది మాత్రం వేర్వేరు బ్రాంచ్‌లలో. ఇద్దరికీ ఈ మధ్యే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కానీ, ఇంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వెలుగుచూసింది.

3 నెల్లల్లో పెళ్లి.. కలకాలం కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి
Engaged Bank Employees Death

Updated on: Aug 14, 2026 | 11:17 AM

ఒకే బ్యాంక్‌లో పనిచేస్తున్న ఇద్దరు కాబోయే భార్యభర్తలు.. కొన్ని గంటల వ్యవధిలో మరణించిన ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కాసరగోడ్‌లోని పూచక్కాడ్‌కు చెందిన 25 ఏళ్ల పి. అనుశ్రీ అనే యువతికి.. కన్నూర్‌లోని ఇరిట్టికి చెందిన 26 ఏళ్ల వి. అమల్‌తో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ జరిగింది. డిసెంబర్‌లో వీళ్లు వివాహం కూడా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఒకే బ్యాంక్‌లో పనిచేస్తున్నారు.. కానీ బ్రాంచ్‌లు మాత్రం వేరు.

అనుశ్రీ కర్ణాటకలోని ఓ బ్రాంచ్‌లో పనిచేస్తుండగా.. అమల్ కేరళలోని ఎర్నాకులం బ్రాంచ్‌లో పనిచేస్తున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ, గురువారం కర్ణాటకలోని హున్సూర్‌లో ఉన్న తన నివాసంలో అనుశ్రీ విగతజీవిగా కనిపించింది. దీనిని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం అనంతరం కాసరగోడ్‌లోని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, అనుశ్రీ మరణవార్త ఎర్నాకులంలో ఉన్న కాబోయే భర్త అమల్‌కు తెలిసింది. ఈ విషయం తెలిసిన కొద్ది గంటల్లోనే అమల్ కూడా ఒక హోటల్ గదిలో శవమై కనిపించాడు. గదిలో అతని మృతదేహాన్ని గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో, వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అమల్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ గానీ, ఇతర ఆధారాలు గానీ లభించకపోవడంతో అతని మరణానికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అమల్ మొబైల్ ఫోన్‌, కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరో మూడు నెలల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన యువతీ యువకులు.. ఇలా గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాబోయే భార్య మరణాన్ని తట్టుకోలేకనే అమల్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నప్పటికీ, పోలీసుల పూర్తి దర్యాప్తు ముగిసిన తర్వాతే అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us