Election Commission: రాజకీయ పార్టీలకు బిగ్ షాక్.. ముందు వాటికి జవాబు చెప్పాలంటూ ఈసీ లేఖ..

ఎన్నికల్లో గెలవాలంటే ఉచితాలు ప్రకటించాల్సిందే.. వాటిని అమలు చేయాల్సిందే.. కొత్త స్కీమ్‌లు లేకుండా ఏ ఎన్నికల్లోనైనా గెలవడం రాజకీయ పార్టీలకు కష్టంగా మారింది.

Election Commission: రాజకీయ పార్టీలకు బిగ్ షాక్.. ముందు వాటికి జవాబు చెప్పాలంటూ ఈసీ లేఖ..
Political Parties
Follow us

|

Updated on: Oct 04, 2022 | 4:31 PM

ఎన్నికల్లో గెలవాలంటే ఉచితాలు ప్రకటించాల్సిందే.. వాటిని అమలు చేయాల్సిందే.. కొత్త స్కీమ్‌లు లేకుండా ఏ ఎన్నికల్లోనైనా గెలవడం రాజకీయ పార్టీలకు కష్టంగా మారింది. డబ్బులు ఉన్నాయా? లేవా? అన్నదానితో సంబంధం లేకుండానే ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు ఉచితాల ప్రవాహాన్ని పారిస్తున్నాయి. వీటన్నింటికి చెక్‌ పెట్టేందుకు దేశంలోని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎన్నికలను పారదర్శంగా నిర్వహించేందుకు పలు చర్యలు చేపట్టిన భారత ఎన్నికల సంఘం మరో కీలక ప్రకటన చేసింది. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో ఉచిత హామీలు సర్వసాధారణంగా మారిన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. పార్టీలు ఇచ్చే ఉచిత తాయిలాలకు అయ్యే ఖర్చు, దాని అమలు సాధ్యాసాధ్యాలపై ఓటర్లకు కచ్చితమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించింది. ఈ మేరకు దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల జాబితా, వాటిని ఎలా నెరవేరుస్తారు, అందుకు ఉన్న ఆర్థిక వనరులు ఏంటో.. పార్టీలు స్పష్టంగా ఓటర్లకు తెలియజేయాలని లేఖలో ఈసీ సూచించింది. వాటికి పార్టీలు ఎలా నిధులు సమకూరుస్తాయి..? వాగ్ధానాలకు మరింత జవాబుదారీగా ఉండేలా కొత్త నిబంధనలను సూచించాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఉచిత హామీల అమలుపై తగినంత స్పష్టత లేకపోతే అది ఆర్థిక సుస్థిరతను దెబ్బతీసే ప్రమాదాన్ని కొట్టిపారేయాలేమని లేఖలో ఈసీ అభిప్రాయపడింది. ఉచిత హామీలకు సంబంధించి అనుసరించాల్సిన ఒక ఉమ్మడి ఫార్మాట్‌ను ఈసీ.. పార్టీలకు పంపింది. అలాగే 2015 ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చిన వివరాలు అందించాలని ఈసీ కోరింది. వాటిపై ఈనెల 19 లోపు సమాధానం ఇవ్వాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బలోపేతం చేయడానికి.. రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని ఈసీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

మేనిఫెస్టోలను రూపొందించడం రాజకీయ పార్టీల హక్కు అనే దృక్కోణంతో కమిషన్ సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నప్పటికీ, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ, స్థాయిని కొనసాగించడంపై కొన్ని వాగ్దానాలు, ఉచితాల అమలు.. పలు అంశాలపై ప్రభావం చూపుతుందని.. పార్టీలు, అభ్యర్థులు కూడా ఈ విషయాలపై దృష్టిపెట్టాలని ఎన్నికల సంఘం ఈ సందర్భంగా పేర్కొంది. అయితే, పార్టీల నుంచి స్పందన రాకపోతే ఈ అంశంపై పార్టీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని భావించాల్సి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..