ఆయుధం అక్కర్లేని సైబర్ నేరం.. భయపెట్టి, నమ్మించి ఖాతాలు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు!

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులను ఎలా భయపెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు? పోలీసులమని, సీబీఐ అధికారులమని నమ్మిస్తూ వీడియో కాల్స్‌తో నకిలీ విచారణలు.. సేఫ్ అకౌంట్ పేరుతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే మోసాలు.. ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ దందాలు.. ఇలాంటి మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోసపోతే వెంటనే చేయాల్సిన పనులపై ప్రత్యేక కథనం.

ఆయుధం అక్కర్లేని సైబర్ నేరం.. భయపెట్టి, నమ్మించి ఖాతాలు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు!
Digital Arrest Scams

Edited By:

Updated on: Nov 14, 2026 | 10:52 AM

ఒక ఫోన్ కాల్.. అవతలి వ్యక్తి మాటల్లో గంభీరత.. వెనుక పోలీస్ స్టేషన్‌లా కనిపించే సెటప్.. స్క్రీన్‌పై యూనిఫాంలో ఓ అధికారి! అంతే.. అవతలి వ్యక్తి చెప్పే మాటలకు ఎదురు చెప్పలేకపోయాడు ఆ 72 ఏళ్ల వృద్ధుడు. మీ పేరుతో అక్రమ వస్తువులు ఉన్న పార్సిల్ పట్టుబడిందని, మీరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా.. మిమ్మల్ని ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నామని ప్రకటించాడు. బయటకు వెళ్లకూడదు.. ఎవరికీ చెప్పకూడదు.. నిర్దోషి అని నిరూపించుకోవాలంటే మీ బ్యాంకు ఖాతాలోని డబ్బును సేఫ్ అకౌంట్‌కు బదిలీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు.

బ్యాంకు శాఖలో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన వ్యక్తి అయినా.. ఒక్కసారిగా భయంతో ఆలోచించే శక్తిని కోల్పోయాడు. చేతులు వణికాయి.. గుండె వేగంగా కొట్టుకుంది. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు కళ్లముందే చేజారిపోతుందేమోనన్న ఆందోళన మొదలైంది. అయితే అదే సమయంలో అనుకోని వ్యక్తి రూపంలో అతడికి సాయం అందింది. ఇంటికి వచ్చిన పొరుగింటి కుర్రాడు.. ఫోన్‌లో మాట్లాడుతున్న వృద్ధుడిని చూసి ఏమైందని ప్రశ్నించాడు. దీంతో జరిగిన విషయాన్ని అతడు బయటపెట్టాడు. అంతే.. క్షణాల్లో అవతలి వ్యక్తి కాల్ కట్ చేశాడు. అప్పటివరకు పోలీసు అధికారిగా నటించిన వ్యక్తి అసలు రంగు బయటపడింది.

అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?

ఇటీవల సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న ప్రమాదకరమైన మోసాల్లో డిజిటల్ అరెస్ట్ ఒకటి. పోలీసులమని, సీబీఐ, ఈడీ లేదా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులమని చెప్పుకుంటూ ఫోన్ చేస్తారు. మీ ఆధార్, బ్యాంకు ఖాతా లేదా పేరుతో అక్రమ కార్యకలాపాలు జరిగాయని భయపెడతారు. ఆ తర్వాత వీడియో కాల్ చేసి పోలీస్ యూనిఫాంలో కనిపిస్తూ నకిలీ విచారణ మొదలుపెడతారు. మీపై కేసు నమోదైందని, అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, విచారణ పూర్తయ్యే వరకు వీడియో కాల్‌లోనే ఉండాలని ఆదేశిస్తారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పొద్దని హెచ్చరిస్తారు. చివరకు మీ డబ్బును పరిశీలించాలంటూ సేఫ్ అకౌంట్ పేరుతో తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు. కానీ గుర్తుంచుకోండి.. ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయరు. ‘డిజిటల్ అరెస్ట్’ అనేది చట్టబద్ధమైన ప్రక్రియ కాదు.

భయమే పెట్టుబడిగా.. కోట్లలో సైబర్ దోపిడీ!

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఏ స్థాయిలో పెరిగాయో గణాంకాలే చెబుతున్నాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గణాంకాల ఆధారంగా వెలువడిన నివేదికల ప్రకారం.. 2024లో మొదటి తొమ్మిది నెలల్లోనే దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కారణంగా బాధితులు ఏకంగా రూ.11,333 కోట్లు నష్టపోయారు. 2024లో దాదాపు 12 లక్షల సైబర్ నేర ఫిర్యాదులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది నమోదైన 11.3 లక్షల ఫిర్యాదులతో పోలిస్తే ఇవి సుమారు 6 శాతం ఎక్కువ. ఇందులో డిజిటల్ అరెస్ట్ మోసాలే 63 వేలకు పైగా ఫిర్యాదులతో రూ.1,616 కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. ఇక షేర్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే పెట్టుబడి మోసాల ద్వారా దాదాపు లక్ష కేసుల్లో రూ.3,216 కోట్లు కొల్లగొట్టారు.

మోసం చేయడానికి నాలుగు అస్త్రాలు!

సైబర్ నేరగాళ్లు బాధితులను మోసం చేయడానికి పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండటం లేదు. మనుషుల బలహీనతలనే ఆయుధాలుగా మార్చుకుంటున్నారు.

1. భయాన్ని సృష్టించడం: మీపై కేసు నమోదైంది.. మీ కుమారుడు ప్రమాదంలో ఉన్నాడు.. మీ బ్యాంకు ఖాతా బ్లాక్ కాబోతోంది అంటూ భయపెడతారు.

2. అత్యవసర పరిస్థితిని కల్పించడం: వెంటనే డబ్బు పంపాలి.. కాల్ కట్ చేయకూడదు.. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తారు. ఆలోచించడానికి సమయం ఇవ్వరు.

3. బాధితుడితోనే డబ్బు పంపించడం: ఓటీపీలు, బ్యాంకు వివరాలు తీసుకోవడం లేదా స్వయంగా డబ్బు బదిలీ చేయించడం ద్వారా మోసానికి పాల్పడతారు. బాధితుడే లావాదేవీ చేయడంతో డబ్బును అడ్డుకోవడం కొన్నిసార్లు కష్టమవుతుంది.

4. ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించడం: కుటుంబ సభ్యులకు, స్నేహితులకు విషయం చెప్పొద్దని ఆదేశిస్తారు. బాధితుడు ఇతరులతో మాట్లాడితే మోసం బయటపడుతుందని వారికి తెలుసు. అందుకే ముందుగా బాధితుడిని ఒంటరిగా మార్చేస్తారు.

ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతోనూ మోసాలు!

ఇదే తరహా మోసాలకు మరో రూపం ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చని, యూట్యూబ్ వీడియోలకు లైక్ చేయాలని, ఆన్‌లైన్ ఉత్పత్తులకు రేటింగ్ ఇవ్వాలని చెబుతారు. మొదట చిన్న మొత్తాలను చెల్లించి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత ఎక్కువ సంపాదించాలంటే ముందుగా డబ్బు డిపాజిట్ చేయాలని, పెద్ద టాస్కులు పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తారు. ఇలా బాధితుల నుంచి పెద్ద మొత్తాలను వసూలు చేసి చివరకు మాయమవుతారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. నిజమైన ఉద్యోగం కోసం ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

మోసపోతే వెంటనే ఏం చేయాలి?

సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చినా, డబ్బు బదిలీ చేసినా ఏమాత్రం ఆలస్యం చేయకూడదు.

– వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలి.

– అధికారిక వెబ్‌సైట్ cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.

– బ్యాంకును సంప్రదించి లావాదేవీ వివరాలు తెలియజేయాలి.

– ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బ్యాంకు లావాదేవీల వివరాలు, స్క్రీన్‌షాట్‌లను ఆధారాలుగా భద్రపరచుకోవాలి.

– పోలీసులమని చెప్పే గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇవ్వకూడదు. వారు చెప్పిన ఖాతాలకు డబ్బు పంపకూడదు.

ముఖ్యంగా మోసపోయిన తర్వాత పరువు పోతుందనో, తెలిసినవాళ్లు ఏమనుకుంటారనో సిగ్గుతో విషయం దాచిపెట్టకూడదు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా డబ్బును నిలిపివేసే అవకాశం ఉంటుంది.

ఆయుధం లేదు.. కానీ భయంతోనే దోపిడీ!

ఈ సైబర్ నేరాల్లో బాధితుల ఫోన్‌లను హ్యాక్ చేయాల్సిన అవసరం కూడా ఉండటం లేదు. వారి మనసుల్లో భయాన్ని నింపి, వారితోనే డబ్బు బదిలీ చేయించుకుంటున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును నిమిషాల్లో మాయం చేస్తున్నారు. ఒక తండ్రి.. ఒక తల్లి.. ఒక తాత.. ఒక మధ్యతరగతి కుటుంబం.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి ఫోన్ కాల్ వచ్చినప్పుడు భయపడకండి. వెంటనే కాల్ కట్ చేయండి. కుటుంబ సభ్యులతో మాట్లాడండి. అధికారిక మార్గాల్లో నిజానిజాలు తెలుసుకోండి.

ఎందుకంటే.. మిమ్మల్ని భయపెట్టి, ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించే వ్యక్తి నిజమైన అధికారి కాదు.. మీ నమ్మకాన్ని దోచుకునే సైబర్ నేరగాడే కావచ్చు!

Loading...
Unable to load recommendations.
Follow Us