
దేశ రాజకీయాల్లో ఇప్పుడు డీలిమిటేషన్ చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎలా మారుతుంది..? ప్రస్తుతం 543 స్థానాలున్న లోక్‌సభ.. 816 స్థానాలకు పెరిగితే.. ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు వస్తాయి..? ముఖ్యంగా జనాభా నియంత్రణ, అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందా..? ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరిగితే.. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందా..? ఈ ప్రశ్నలకు సమాధానంగా డిటైల్డ్ మ్యాప్‌ను రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లు ఎన్ని? పునర్విభజన తర్వాత పెరిగే సీట్లు ఎన్ని? అనే ఆంశాలపై ఆ మ్యాప్‌లో క్లారిటీ ఇచ్చింది కేంద్రం.
ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలున్నాయి. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రకారం.. ఈ సంఖ్య 816కు పెరుగుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ స్థానాల సంఖ్య దాదాపు 50 శాతం పెరుగుతుంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 80 లోక్‌సభ స్థానాలుండగా.. డీలిమిటేషన్ తర్వాత 120కు పెరుగుతుంది. అలాగే బీహార్‌లో ప్రస్తుతం 40 స్థానాల నుంచి 60 స్థానాలకు.. మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 43 స్థానాలకు.. రాజస్థాన్‌లో 25 నుంచి 38 స్థానాలకు పెరుగుదల ఉంటుంది. మహారాష్ట్రలో ఎంపీ స్థానాలు 48 నుంచి 72కు పెరుగుతాయి.
Delimitation Map Released
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనపై కూడా క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కర్నాటకలో ప్రస్తుతం 28 లోక్‌సభ స్థానాలుండగా.. డీలిమిటేషన్ తర్వాత 42 స్థానాలకు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాల నుంచి 38 స్థానాలకు.. తెలంగాణలో 17 నుంచి 26 స్థానాలకు పెరుగుతాయి. తమిళనాడులో ప్రస్తుతం 39 స్థానాలుండగా.. 59కు పెరుగుతాయని కేంద్రం వివరించింది. ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాల్లో 129 స్థానాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 23.76 శాతం. 816 స్థానాల లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల స్థానాలు 195కు పెరిగితే.. వాటి వాటా 23.90 శాతానికి చేరుతుంది. అంటే గతంలో ఉన్న నిష్పత్తే దాదాపు కొనసాగుతుంది.
ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు ఈ డీలిమిటేషన్ అని చెబుతోంది కేంద్రం. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాలను పునర్విభజించడం వల్ల ప్రజలందరికీ సమానమైన ప్రాతినిధ్యం లభిస్తుందని,తద్వారా ప్రజాస్వామ్య పునాది మరింత బలోపేతం అవుతుంది చెబుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ కోసం, మరింత మెరుగైన పార్లమెంటును రూపొందించడమే దీని ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేస్తోంది.