
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఎరువుల కంటైనర్ అదుపుతప్పి కారుపై బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులతో పాటు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. అయితే కారులో ఉన్న ఆరేళ్ల బాలుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషాద ఘటనతో మృతుల స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. సహారన్‌పూర్‌లోని గోకుల్ ధామ్ కాలనీకి చెందిన విశేష్ కపూర్ (38) బుధవారం (నవంబర్ 04) సాయంత్రం తన తల్లి కిరణ్ కపూర్ (63), భార్య నిషా కపూర్ (38), ఆరేళ్ల కుమారుడు మహేర్‌తో కలిసి డెహ్రాడూన్‌కు బయలుదేరారు. కారును డ్రైవర్ నీరజ్ నడుపుతున్నాడు. డెహ్రాడూన్‌లో నివసిస్తున్న తన సోదరుడు దీపేష్ కపూర్ ఇంటికి వెళ్లేందుకు వారు ప్రయాణం అయ్యారు. డెహ్రాడూన్‌లోని మొహబ్బేవాలా ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఎరువులతో నిండిన భారీ కంటైనర్ అదుపుతప్పి వారి కారుపై బోల్తా పడింది. కంటైనర్ బరువుకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో విశేష్, ఆయన తల్లి కిరణ్, భార్య నిషా, డ్రైవర్ నీరజ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భారీ కంటైనర్ కింద కారు పూర్తిగా నలిగిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చివరకు గ్యాస్ కట్టర్ల సాయంతో కారు తలుపులు, ఇతర భాగాలను తొలగించి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో ఆరేళ్ల మహేర్ సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులకు కొంత ఊరట లభించినప్పటికీ, తండ్రి, తల్లి, నానమ్మను కోల్పోవడంతో ఆ చిన్నారి పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ప్రమాద వార్త సహారన్‌పూర్‌లోని కుటుంబ సభ్యులకు చేరడంతో గోకుల్ ధామ్ కాలనీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఒకే ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
భారీ వాహనాల అతివేగం, లోడ్ నియంత్రణపై మరోసారి ప్రశ్నలు: ఈ ఘటనతో భారీ వాహనాల వేగం, సరుకు లోడింగ్ పరిమితుల అమలు, రహదారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, కంటైనర్‌లో నిర్ణీత పరిమితికి మించి ఎరువులు నింపారా లేదా అనే అంశాలపై పోలీసులు అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..