టాస్ వేసిన కాసేపటికే విషాదం.. క్రికెట్ ఆడుతుండగా కుప్పకూలిన 25ఏళ్ల యువకుడు..!

రాజస్థాన్‌లోని దౌసాలో 25 ఏళ్ల యువకుడు రామ్‌రాజ్ మీనా క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో కుప్పకూలి మృతి చెందాడు. గుండెపోటు కారణంగానే ఈ విషాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఐదు నెలల క్రితమే వివాహమైన రామ్‌రాజ్ మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన యువకులలో గుండె ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది.

టాస్ వేసిన కాసేపటికే విషాదం.. క్రికెట్ ఆడుతుండగా కుప్పకూలిన 25ఏళ్ల యువకుడు..!
Cricket Tragedy

Updated on: Sep 21, 2026 | 6:20 PM

రాజస్థాన్: క్రికెట్ మైదానంలో సరదాగా మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఓ యువకుడు అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో కుప్పకూలి మృతి చెందాడు. అప్పటివరకు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఉన్న అతడు.. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో చోటుచేసుకుంది.

దౌసా జిల్లా సమ్లేటి గ్రామంలో కొంతమంది యువకులు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల రామ్‌రాజ్ మీనా ఓ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. మ్యాచ్‌కు ముందు టాస్ నిర్వహించగా.. రామ్‌రాజ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం క్రీజులోకి వెళ్లి బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే అతడికి అకస్మాత్తుగా ఛాతీలో తీవ్ర నొప్పి వచ్చింది. నొప్పితో విలవిల్లాడిన రామ్‌రాజ్ ఒక్కసారిగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని మహ్వా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం జైపూర్‌కు తీసుకెళ్లాలని సూచించారు.

కుటుంబ సభ్యులు రామ్‌రాజ్‌ను జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రాథమిక విచారణలో గుండెపోటు కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, మృతికి సంబంధించిన పూర్తి కారణాలపై అధికారిక నిర్ధారణ కోసం తదుపరి వైద్యపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.

సమాచారం అందుకున్న మహ్వా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహ్వా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ మహేంద్ర సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. క్రికెట్ ఆడుతున్న సమయంలో యువకుడికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం అందిందని తెలిపారు. ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

ఇదిలా ఉండగా, రామ్‌రాజ్‌కు కేవలం ఐదు నెలల క్రితమే వివాహమైనట్లు పోలీసులు తెలిపారు. అతడు ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. మ్యాచ్‌కు ముందు రామ్‌రాజ్ తన స్నేహితులతో కలిసి టాస్ వేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాస్ వేసి కాసేపటికే అతడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us