ఎన్నికల రాజకీయాల్లో ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించి, తాము అధికారం చేపట్టాలనే కోరుకుంటుంది. గెలుపు మీద ఆశ, గెలవాలన్న ఆకాంక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఈ క్రమంలో అధికారంలో ఉన్నవారిని దించేసి తమను ఎన్నుకోవాలని ప్రజల్ని కోరుతుంటారు. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. కానీ ప్రజలు కేవలం ఈ మాటలకే కన్విన్స్ అవుతారా? అధికారంలో ఉన్న పార్టీ విస్మరించిన అంశాలేంటి.. విఫలం చెందిన రంగాలేంటి అన్నది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకుండా ‘దించేద్దాం రండి’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తే సరిపోతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇదే ప్రశ్న తలెత్తుతోంది. అధికారంలో ఉన్న పార్టీ గత 50-60 ఏళ్లలో జరగని అభివృద్ధి తాము చేశామని చెబుతోంది. జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, కొత్త విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో గణాంకాలను సైతం వెల్లడిస్తోంది. అభివృద్ధి మాత్రమే కాదు, ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ సహా తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల చిట్టాను కూడా ప్రజలు ముందు పెడుతోంది. చేసినవి చెప్పుకోవడంతో పాటు మళ్లీ అధికారం అప్పగిస్తే ఏం చేస్తామన్న విషయంలోనూ ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) నినాదంతో ప్రచారంలో దూసుకెళ్తోంది.
కానీ 139 ఏళ్ల చరిత్ర కల్గిన గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను దాటి ఆలోచించలేకపోతోంది అన్న విమర్శను ఎదుర్కొంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ఈ విమర్శలు కేవలం రాజకీయ విమర్శగానే కాదు, ఆ పార్టీ ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశంగా పరిగణించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతోంది. ప్రతిపక్షం గుడ్డిగా మోదీని విమర్శించడమే లక్ష్యంగా.. ఆ పార్టీ ఏం చేసినా తప్పే అన్నట్టుగా వ్యవహరిస్తోంది తప్ప అసలు ప్రభుత్వం విఫలమైన రంగాలు, విస్మరించిన అంశాలపై అధ్యయనం, చర్చ లేకుండా చేస్తోంది. దేశ ప్రజల ఆకాంక్షాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ అనుసరించే విధానాలే ఆ పార్టీని చరిత్రలో ఎన్నడూ లేనంత దయనీయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి.
‘యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA)’ పేరుతో దశాబ్దకాలం పాటు సమర్థవంతంగా సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ కూటమిని మరింత విస్తరించి ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A)’గా పేరు మార్చింది. పేరు మార్పుతో పురోగతి కనిపించాలి కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో పెద్దన్నగా కాంగ్రెస్ పార్టీ మిగతా భాగస్వామ్య పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనే అంశాలను నిర్ణయించేది. అంటే కాంగ్రెస్ ఇచ్చే పార్టీగా, కూటమిలోని మిగతా పార్టీలు తీసుకునే పార్టీలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పూర్తిగా రివర్స్‌లో కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇచ్చే సీట్లను తీసుకునే పార్టీగా దిగజారింది. విపక్ష కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC), సమాజ్‌వాదీ (SP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), తమిళనాట డీఎంకే సహా చివరకు కేరళ వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు సైతం కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చే స్థితిలో ఉన్నాయి. ఇక్కడ నిర్ణయాధికారం ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలదే తప్ప కాంగ్రెస్ పార్టీది కాదు. గతంలో ప్రాంతీయ పార్టీలతో పొత్తున్నా, లేకున్నా గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్‌లో కనిపించేది. కానీ ఇప్పుడు పొత్తు లేకుంటే గెలవడం కష్టం అన్న భావన ఆ పార్టీలో ఏర్పడింది. అందుకే విపక్ష ఇండి కూటమిలో పేరుకే పెద్దన్న పాత్ర తప్ప నిజానికి ప్రాంతీయ పార్టీలను నియంత్రించి, నిర్దేశించే స్థితిలో కాంగ్రెస్ లేదన్నది స్పష్టమవుతోంది.
లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ 2009లో 206 స్థానాల నుంచి 2014లో 44 స్థానాలకు పడిపోగా, 2019 నాటికి 52 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన సీట్లకు తగ్గట్టే జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ పట్టు, స్థాయి కూడా పడిపోతూ వచ్చింది. ఈ పదేళ్ల కాలంలో ఇందుకు దారితీసిన పరిస్థితులేంటి.. బీజేపీ నానాటికీ బలమైన ప్రత్యర్థిగా ఎలా ఎదుగుతోంది అన్న విషయాలపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టినట్టుగా కనిపించడం లేదు. ప్రజలకు దగ్గరైన మోదీని దూరం చేయాలన్న యావ తప్ప తాము ఎలా దగ్గరవ్వాలన్న ఆలోచనే లేదని కొందరు రాజకీయ నిపుణులు విమర్శిస్తున్నారు.
కుటుంబం, వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో విడదీయలేనంతగా పెనవేసుకుపోయాయి. గాంధీ-నెహ్రూ కుటుంబేతరుడిని పార్టీకి జాతీయాధ్యక్షుడిగా చేసినా సరే ఆ పార్టీలో పెత్తనం, నిర్ణయాధికారం పూర్తిగా గాంధీ-నెహ్రూ కుటుంబానిదే అన్న విషయం అందరికీ తెలిసిందే. గాంధీ కుటుంబాన్ని ఆకట్టుకుని, వారితో సన్నిహితంగా మెలిగే నేతలకు ఉన్నత పదవులు, బాధ్యతలు దక్కుతున్నాయి. కానీ పార్టీలో కష్టపడి, నిబద్ధతతో పనిచేసే నాయకులకు మాత్రం అవకాశాలు దక్కడం లేదు. తాము నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నామన్న భావన అలాంటి నేతల్లో ఏర్పడుతోంది. అలాంటివారు పార్టీని వీడి ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. గాంధీ కుటుంబాన్ని భ్రమల్లో ఉంచుతూ, క్షేత్రస్థాయిలో వాస్తవ స్థితిగతులు వారికి తెలియకుండా భజన చేస్తున్న కోటరీ నేతల కారణంగా పార్టీ పనితీరు, ప్రాభవం నానాటికీ తగ్గిపోతోంది. విజన్‌తో కష్టపడి పనిచేసే నేతలను నాయకత్వానికి దరిదాపుల్లోకి కూడా రాకుండా కోటరీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తుంటారు. గాంధీ కుటుంబ నేతలు నిద్రలేచినప్పుడే సూర్యుడు ఉదయిస్తాడని నమ్మించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది.
ఆ పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP)లో పేరుకు మోదీ, అమిత్ షా తిరుగులేని శక్తివంతమైన నేతలుగా కనిపిస్తున్నప్పటికీ… అక్కడ పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తకు సైతం ఉన్నత పదవులు, బాధ్యతలు, గౌరవం దక్కుతుందని నిరూపిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా అవకాశం దక్కించుకున్నవారిలో, పార్టీ జాతీయ నాయకత్వంలో అతి సామాన్య కార్యకర్తలు కూడా ఉండడమే ఇందుకు నిదర్శనం. జనంలో నుంచి వచ్చిన ఆ సామాన్య కార్యకర్తలు జనం సమస్యలు, వారి ఆకాంక్షల గురించి మంచి అవగాహన కలిగి ఉంటున్నారు. అలాంటివారికి బాధ్యతలు, పదవులు అప్పగించడం ద్వారా శక్తివంతమైన కొత్త నాయకత్వం తయారవుతోంది. అంతిమంగా పార్టీ కూడా నానాటికీ బలపడుతూ ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడగట్టుకుంటోంది. మొత్తంగా కాషాయ పార్టీ కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో కొత్త కొత్త ముఖాలను ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ 80ల నాటి పాత ముఖాలపైనే ఆధారపడుతోంది. కొత్త ఆలోచనలు లేవు, దేశంలోని యువ జనాభాను ఆకర్షించే దృక్పథం లేదు. అన్నింటికంటే భారతదేశ భవిష్యత్తు కోసం ఖచ్చితమైన రోడ్ మ్యాప్ లేదు. నేడు కాంగ్రెస్ వైకల్యంతో, నాయకత్వరహితంగా, దిక్కులేని పార్టీగా మారిందని.. ఆ పార్టీతో కలిసి నడిచేందుకు సొంత నేతలే సిద్ధంగా లేరని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..