Tamil Nadu: ప్రాంక్ వీడియోల పేరుతో తల తిక్క పనులు చేస్తున్నారా.. అయితే పోలీస్ కేసులు ఫేస్ చేసేందుకు కూడా రెడీగా ఉండండి. అవును.. తాజాగా కోయంబత్తూరు(Coimbatore) పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలను రికార్డ్ చేసిన యూట్యూబ్ చానెల్‌పై సుమోటో కేసు నమోదు చేశారు. మహిళలు, వృద్ధులు, ఇతరులతో కూడిన ప్రాంక్ వీడియోలను అప్లోడ్ చేస్తున్న కోవై 360 అనే యూట్యూబ్ చానల్‌పై సైబర్ క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది. దాదాపు 1.8 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న కోవై 360 చానల్ నిర్వాహకులు.. వ్యక్తుల అనుమతి లేకుండా చిత్రీకరించిన వీడియోలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 354 డి, తమిళనాడులోని మహిళలపై వేధింపుల నిషేధ చట్టంలోని సెక్షన్ 66E సెక్షన్ 4 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. నగర కమిషనర్ వి బాలకృష్ణన్ ఆదేశాల అనుసరించి..ప్రజల గోప్యతను హరించి, వారిని మానసిక వేదనకు గురిచేసే వీడియోలను అప్లోడ్ చేస్తున్న చానెల్స్‌ను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాంక్ వీడియోలను అప్లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..