క్యాన్సర్ మందుల ధరలకు కళ్లెం.. రోగులకు ఏటా రూ.2,500 కోట్ల ఆదా!

క్యాన్సర్‌ రోగులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌ షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ మందులపై ట్రేడ్‌ మార్జిన్లను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)లో 30 శాతానికి పరిమితం చేయనుంది. ఈ చర్యతో కొన్ని మందుల ధరలు 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉండగా, రోగులకు ఏటా సుమారు రూ.2,500 కోట్ల మేర ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

క్యాన్సర్ మందుల ధరలకు కళ్లెం.. రోగులకు ఏటా రూ.2,500 కోట్ల ఆదా!
Medicines

Updated on: Oct 09, 2026 | 10:06 AM

క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. నాన్‌ షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ మందుల విక్రయాల్లో వసూలు చేసే ట్రేడ్‌ మార్జిన్లపై 30 శాతం పరిమితి విధించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో కొన్ని మందుల ధరలు బాగా తగ్గే అవకాశం ఉండగా.. రోగులకు ఏటా సుమారు రూ.2,500 కోట్ల మేర ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఖరీదైన క్యాన్సర్‌ చికిత్సతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోగులు, వారి కుటుంబాలకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది.

మందుల ధరలు 70 శాతం వరకు తగ్గే అవకాశం

ప్రస్తుతం ప్రభుత్వ ధరల నియంత్రణ పరిధిలో ఉన్న షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ మందులకు ఇప్పటికే గరిష్ఠ ధరల పరిమితులు అమల్లో ఉన్నాయి. అయితే ఈ జాబితాలో లేని నాన్‌ షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ మందుల విషయంలోనూ అధిక ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది.

ఈ మందుల సరఫరా, విక్రయాల్లో వసూలు చేసే ట్రేడ్‌ మార్జిన్లను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)లో 30 శాతానికి పరిమితం చేయనున్నారు. ఈ చర్యతో కొన్ని మందుల ధరలు 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఏయే మందులకు ఈ నియంత్రణ వర్తిస్తుందన్నది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీహెచ్‌ఎస్‌) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నియంత్రణ పరిధిలోకి వచ్చే మందుల జాబితాను ఖరారు చేయనుంది. అనంతరం నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) నిర్ణయం తీసుకుని అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

కొన్ని మందులపై 700 శాతానికి మించి మార్జిన్లు!

దేశంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్స ఖర్చులు రోగులకు పెద్ద భారంగా మారుతున్నాయి. ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 60 మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మందుల కొనుగోలుకే అధిక మొత్తాలు ఖర్చు చేయాల్సి రావడంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఎన్‌పీపీఏ మార్కెట్‌ లెక్కల విశ్లేషణ ప్రకారం, నాన్‌ షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ మందులపై సగటున సుమారు 170 శాతం ధర పెరుగుదల నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ పెరుగుదల 700 శాతానికి మించి ఉంటోంది. సరఫరా వ్యవస్థలో మందులు తయారీదారుల నుంచి రోగుల వరకు చేరే క్రమంలో ధరలు భారీగా పెరుగుతున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

రిటైల్‌ మెడికల్‌ షాపులు, ఆసుపత్రుల ఫార్మసీలు, ఆన్‌లైన్‌ ఫార్మసీల్లోనూ మందుల ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. మందుల కొనుగోలు ధరకు, వినియోగదారులు చెల్లించే ఎంఆర్‌పీకి మధ్య భారీ తేడా ఉండటంపై మహారాష్ట్ర, రాజస్థాన్‌, కర్ణాటక వంటి రాష్ట్రాలు, రోగులు, పౌరసమాజ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అధిక మార్జిన్లను నియంత్రించి, రోగులకు న్యాయమైన ధరలకు మందులు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

2019లోనూ ధరల తగ్గింపు చర్యలు

క్యాన్సర్‌ మందుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనూ చర్యలు చేపట్టింది. 2019 ఫిబ్రవరిలో 42 రకాల నాన్‌ షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ మందులపై ట్రేడ్‌ మార్జిన్లను పరిమితం చేసింది. డ్రగ్స్‌ (ప్రైసెస్‌ కంట్రోల్‌) ఆర్డర్‌–2013లోని పేరా 19 ప్రకారం ఈ నిర్ణయం అమలు చేశారు.

దీంతో కొన్ని మందుల గరిష్ఠ చిల్లర ధరలు 91 శాతం వరకు తగ్గాయి. 526 బ్రాండ్లపై ఈ చర్య ద్వారా ఏటా సుమారు రూ.984 కోట్లు ఆదా అయినట్లు నివేదికలు వెల్లడించాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ విధానాన్ని మరింత విస్తరించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

మందుల కొరత రాకుండా ఉత్పత్తిపై నిబంధన

ధరలను తగ్గించే క్రమంలో ప్రాణాలను కాపాడే మందుల లభ్యతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం మరో నిబంధనను కూడా ప్రతిపాదించింది. నాన్‌ షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ మందుల తయారీదారులు ప్రస్తుతం కొనసాగిస్తున్న ఉత్పత్తి స్థాయులను కొనసాగించాల్సి ఉంటుంది.

బ్రాండెడ్‌, జనరిక్‌ మందులతో పాటు దేశీయంగా తయారయ్యే మందులు, దిగుమతి చేసుకునేవి, పేటెంట్‌ ఉన్నవి, పేటెంట్‌ లేనివి.. ఇలా వివిధ రకాల నాన్‌ షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ మందులకు ఈ నియంత్రణ వర్తించనుంది.

మొత్తంగా, క్యాన్సర్‌ చికిత్సలో మందుల ఖర్చును తగ్గించడం, అధిక ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడం, రోగులకు మందులు అందుబాటులో ఉండేలా చూడటం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. అయితే రోగులకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందన్నది నియంత్రణ పరిధిలోకి వచ్చే మందుల జాబితా, అధికారిక నోటిఫికేషన్‌, అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us